
సబ్సిడీ పెంపు స్వల్పమే.
ఎరువులకు పెంపు... పెట్రోలియానికి తగ్గింపు
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తాజా బడ్జెట్‌లో సబ్సిడీ బిల్లును స్వల్పంగా పెంచి రూ. 2.60 లక్షల కోట్లు కేటాయించారు. అయితే.. ఆహార, ఇంధన, ఎరువులకు కేటాయిస్తున్న సబ్సిడీలు లబ్ధిదారులకు మరింత ఖచ్చితత్వంతో చేరేలా సబ్సిడీ విధానాన్ని పునర్‌వ్యవస్థీకరిస్తామని.. ఈ క్రమంలో పేద, అణగారిన, ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని ప్రకటించారు. కొత్త ఎరువుల విధానాన్నీ రూపొందిస్తామని చెప్పారు. సబ్సిడీ బిల్లు 2013-14 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల మేరకు రూ. 2,55,516.00 కోట్లుగా ఉండగా.. దానిని 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,60,658 కోట్లకు పెం చారు. ఈ ఏడాది ఎరువుల రంగానికి కేటాయింపులు పెంచటం వల్ల సబ్సిడీ బిల్లు మొత్తంగా పెరిగింది. మధ్యం తర బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీకి రూ. 67,970 కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్‌లో దానిని రూ. 72,970.30 కోట్లకు పెంచారు. ఇందులో దిగుమతి చేసుకున్న ఎరువులకు (యూరియా) రూ. 12,300 కోట్లు, దేశీయంగా ఉత్పత్తి చేసిన ఎరువులకు (యూరియా) రూ. 36,000 కోట్లు, ఫాస్ఫేట్, పొటాసియం వంటి ఎరువుల విక్రయానికి రూ. 24,670.30 కోట్లు చొప్పున కేటాయించారు.
ఆహార భద్రతకు రూ. 88,500 కోట్లు
ఇక ఆహార సబ్సిడీ కింద మధ్యంతర బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం రూ. 1,15,000 కోట్లనే యథాతథంగా ప్రతిపాదించారు. గత ప్రభుత్వమే ఆహార భద్రత చట్టం అమలులోకి తెచ్చిన నేపధ్యంలో ఆహార సబ్సిడీని గత ఆర్థిక సంవత్సరం కన్నా మధ్యంతర బడ్జెట్‌లో భారీగా రూ. 23,000 కోట్లు పెంచింది. మొత్తం ఆహార సబ్సిడీ బిల్లులో జాతీయ ఆహార భధ్రత చట్టం అమలు కోసం రూ. 88,500 కోట్లు కేటాయిం చారు. ఆహార భద్రత చట్టం అమలు గడువును మరో మూడు నెలలు పొడిగించి ఈ ఏడాది సెప్టెంబర్‌గా నిర్ణయించారు. ఇక ఇంధనం, ఎల్‌పీజీ గ్యాస్, కిరోసిన్‌లను వాస్తవ ధరకన్నా తక్కువ ధరకు విక్రయిస్తున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు అందించే పెట్రోలియం సబ్సిడీ రూ. 63,426.95 కోట్లుగా జైట్లీ ప్రతిపాదించారు. గత ఏడాది పెట్రోలియం సబ్సిడీ సవరించిన అంచనాలు రూ. 85,480 కోట్ల కన్నా తగ్గింది. మొత్తం మీద సబ్సిడీ బిల్లులో పెరుగుదల స్వల్పమే అయినప్పటికీ.. అది ఈ ఆర్థిక సంవ్సరంలో ద్రవ్యలోటుపై ప్రభావం చూపనుంది.