లక్షల ఏళ్ళ క్రితమే అక్కడ మనుషులున్నారు..
బెంగళూరుః దేశంలోనే సాఫ్ట్ వేర్ కార్యకలాపాలకు కేంద్రంగా... సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు నగరం ఇప్పుడు ప్రాచీన చరిత్రకూ సాక్ష్యంగా మారింది. చరిత్రకారుడు డాక్టర్ కె.బి. శివతారక్ మొదటిసారి బెంగళూరులో జరిపిన పరిశోధనల్లో రాతియుగంనాటి ఆనవాళ్ళు కనిపించాయి. నాలుగు లక్షల ఏళ్ళ క్రితమే అక్కడ మనుషుల ఉనికి ఉన్నట్లు ఆయన తన పరిశోధనల ద్వారా నిరూపించారు.
బెంగళూరులో మొట్టమొదటిసారి రాతియుగంనాటి చరిత్రకు ఆనవాళ్ళు బయటపడ్డాయి. బెంగళూరు ప్రాంతంలో 4 లక్షల ఏళ్ళ క్రితమే మనుషుల మనుగడ ఉన్నట్లు మంగళూరు విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర, పురాతత్వ శాస్త్రాల రిటైర్డ్ ప్రొఫెసర్ కె.బి. శివతారక్ వెల్లడించారు. తవ్వకాల్లో ఇంతకు ముందెప్పుడూ బయట పడని లక్షల ఏళ్ళనాటి చారిత్రక సాక్ష్యాలు వెలువడినట్లు ఆయన చెప్తున్నారు. కదిరెనహల్లి ప్రాంతంలో నీటి పైపుల లీకేజ్ ను పరిశీలించేందుకు మే నెలలో చేపట్టిన తవ్వకాల సమయంలో తానక్కడే ఉన్నానని, సమీపంలోనే నివసిస్తుండటంతో అక్కడి తవ్వకాలను ఎంతో ఉత్సుకతతో గమనించానని, అక్కడ బయటపడ్డ రాళ్ళను తీసి పరిశీలించడంతో, గతంలో తాను తుముకూరు, మాండ్యా, చిత్రదుర్గ జిల్లాల నుంచి సేకరించిన ప్రాచీన పనిముట్లకు సంబంధించిన పోలికలు ఉన్నట్లు గమనించానని శివతారక్ తెలిపారు.
చేతి గొడ్డలి, ఆకురాయి, సుత్తి, స్ఫటిక శిల వంటి ఐదు రాతి పనిముట్లను వనశంకరి ప్రాంతంనుంచీ తాను సేకరించినట్లు శివతారక్ తెలిపారు. రాతియుగంనాటి మనుషులు ఈ పనిముట్లను వివిధ అవసరాలకు వినియోగించినట్లు తెలుస్తోందని చెప్పారు. అప్పట్లో వేట ప్రధాన వృత్తిగా ఉండటంతో జంతువులను చంపేందుకు, వాటి చర్మం ఒలిచేందుకు, ఇతర పనులకు రాతి పనిముట్లను వినియోగించి ఉండొచ్చని ఆయన వివరించారు. తనకు దొరకిన పరికరాలను ఆయన పురాతత్వ కార్యాలయానికి సమర్పించారు. అయితే రాతియుగంనాటి మనుషులు బెంగళూరు పరిసరాల్లో నివసించినట్లు ఇంతకు ముందు ఎటువంటి ఆధారాలు లేవని, అలాగే స్ఫటిక క్వారీలు, పనిముట్ల వినియోగం కూడా కనిపించలేదని, తుమకూరు ప్రాంతంలో ఈ స్ఫటిక, రాతి పనిముట్లు ఎలా బయటపడ్డాయో అంతుచిక్కడం లేదని కర్ణాటక విశ్వవిద్యాలయానికి చెందిన మరో పురాతత్వ మాజీ ప్రొఫెసర్ రవి తెలిపారు.