యూపీలో బీజేపీ వర్సెస్ ఎస్పీ.. పోటాపోటీ!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ అక్కడి అధికార పార్టీ సమాజ్ వాది పార్టీల మధ్యనే ఉంటుందని తాజా ఎన్నికల సర్వేలో తెలిసింది. ఆ రెండు పార్టీలకు దాదాపు సమానమైన అసెంబ్లీ సీట్లు వచ్చి.. అధికారం నీకా నాకా అనే పరిస్థితి ఉంటుందని ఆ సర్వేలో తేలింది. ఇక మరో ప్రముఖ పార్టీ బహుజన్ సమాజ్ వాది మాత్రం మూడోస్థానానికి పరిమితం అవుతుందని సర్వే తెలిపింది. మరోపక్క, ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్ పార్టీకి కేవలం స్వతంత్ర్య ఇతర అభ్యర్థులకు దక్కేటన్ని సీట్లు మాత్రమే అరకొరగా వస్తాయని ఆ సర్వే చెప్పింది.
ఇండియా టీవీ-సీఓటర్ ఈ సర్వేను నిర్వహించింది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్లోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20, 642మందిని సంప్రదించి ప్రశ్నించి ఈ అంచనాను నమోదుచేసింది. ఈ సర్వే తెలిపిన ప్రకారం ఆయా పార్టీలకు దక్కే సీట్లను ఒకసారి పరిశీలిస్తే.. బీజేపీకి 134 నుంచి 150 మధ్య సీట్లు రానుండగా సమాజ్ వాది పార్టీ 133 నుంచి 149 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇక బహుజన్ సమాజ్ వాది పార్టీ మాత్రం 95 స్థానాల నుంచి 111 మధ్య గెలుచుకొని మూడో స్థానానికి పరిమితం అవుతుందట.
ఎన్నికలు ప్రారంభమయ్యేందుకు ఏడాది సమయం ఉందనగానే ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే ప్రచార హడావిడి మొదలుపెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం 5 నుంచి 13 సీట్లు మాత్రమే దక్కించుకుంటుందని సర్వే పేర్కొంది. మొత్తానికి బీజేపీ, ఎస్పీ పార్టీలు అధికారం చేజిక్కించుకునేందుకు కావాల్సిన మెజారిటికీ కొద్ది దూరంలోనే ఆగిపోతాయని సర్వే వెల్లడించింది.
అంతకుముందు, ఏబీపీ న్యూస్- లోక్‌నీతి, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. తాము సమాజ్‌వాదీకే ఓటేస్తామని 30 శాతం ఓటర్లు చెప్పినట్లు తెలిపిన విషయం తెలిసిందే. రెండు చిన్న పార్టీలతో పొత్తుపెట్టుకున్న బీజేపీకి 27 శాతం మంది ఓటర్లు అనుకూలంగా ఉన్నారని కూడా ఆ సర్వే తెలిపింది. దళిత ఉద్యమాలను ఎంత రెచ్చగొట్టినా, బీఎస్పీ మాత్రం 26శాతం ఓట్లతో మూడో స్థానానికే పరిమితం కానుందని, కాంగ్రెస్ పార్టీకి మహా అయితే 5 శాతం ఓట్లు రావడం ఎక్కువని ఆ సర్వే పేర్కొంది.