‘ప్రణాళిక’ రూపకల్పనలో రాజకీయ పార్టీలు
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు ‘మేనిఫెస్టో’లను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా రూపొందించి ప్రజల మద్దతు కొల్లగొట్టాలనే పట్టుదలతో కదులుతున్నాయి. ఇటీవలే ఆమ్‌ఆద్మీ పార్టీ ‘డిల్లీ డైలాగ్’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇదేక్రమంలో బీజేపీ కూడా నగర అభివృద్ధికి తగ్గట్టుగా మేనిఫెస్టో రూపొందించే పనిలో పడింది.
ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ‘వెబ్‌సైట్’ను శుక్రవారం ప్రారంభించారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే ఏమి చేయాలనే విషయాలపై ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. రాష్ర్టంలోని మూడు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు ఈ పనుల్లో బీజిగా మారాయి.
ఓ అడుగు ముందుకేసి ఆప్ అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితా 22 మందితో విడుదల చేసింది. త్వరలో కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ అభ్యర్థులను వెల్లండించనున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీలు ఏర్పాటు చేసుకొన్న వెబ్‌సైట్లకు సలహాలు, సూచనలు అందజేయాలని ప్రజలను కోరుతున్నాయి. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొంటామని హామీ ఇస్తున్నాయి. అందరం కలిసి నగరాన్ని నందనవనంగా తీర్చిదిద్దుదామని పిలుపు ఇస్తున్నాయి.
ఫేస్‌బుక్కుల్లోనూ హల్‌చల్
ముఖ్యమైన సమాచారాన్ని ‘ఫేస్‌బుక్’ల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాయి. సుమారు 15 లక్షల మందికి నూతనంగా పార్టీ సభ్యత్వాలు అందజేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నామని బీజేపీ అధ్యక్షుడు ఉపాధ్యాయ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.
మొదటి రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగింది. ఇందులో 3.7 లక్షల మంది సభ్యత్వం నమోదు చేసుకొన్నారని చెప్పారు. సభ్యత్వ నమోదుకు నగరలో అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి సంపూర్ణ మద్దతు అందజేస్తారని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.