మూడో రోజూ సభను అడ్డుకున్న కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు వరుసగా మూడో రోజూ పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళన కొనసాగించారు. బుధవారం ఉదయం లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, కనుమూరి బాపిరాజు, ఎస్.పి.వై.రెడ్డిలు రెండవ వరుస స్థానాల్లో నిలబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. ఆ తర్వాత మధ్యాహ్నం మా త్రం వీరు సభామధ్యంలోకి దూసుకెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
సభామధ్యంలోకి వెళ్లి పాలకపార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కల్గించవద్దన్న సోనియా గాంధీ సూచన మేరకు ఆమె సభలో ఉన్నంతసేపూ రెండవ వరుసలోని స్థానాలలోనే నిలబడి నిరసన తెలిపిన కాంగ్రెస్ సభ్యులు ఆ తర్వాత పోడియం వద్దకెళ్లి గందరగోళం సృష్టించారు. వీరితోపాటు టీడీపీ సభ్యులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొనకళ్ల నారాయణరావు, శివప్రసాద్‌లు సభ ప్రారంభమైనప్పటి నుంచీ సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఒక దశలో సోనియా, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ల స్థానాల వద్దకు వచ్చి రాష్ట్రాన్ని ఎందుకు ముక్కలు చేస్తున్నారంటూ ప్రధానిని ప్రశ్నించేందుకు యత్నించారు. దీంతో సోనియా వారిపై కొంత చికాకును ప్రదర్శించి ప్రతిపక్ష బెంచీల వైపు వెళ్లాలని సైగలు చేశారు. కాగా, రాజ్యసభలో టీడీపీ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ నిరసన వ్యక్తంచేశారు.
ఉభయ సభల్లో సమైక్యాంధ్ర హోరు
Published Thu, Aug 8 2013 5:18 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement