
ఢిల్లీకి పంజాబ్ రైతుల పొగ!
ఢిల్లీలో పొగమంచు తీవ్రంగా కమ్ముకోవడానికి, ఢిల్లీవాసులు శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోవడానికీ పంజాబ్ రైతులు పొగ పెట్టడమే కారణమట!
ఢిల్లీలో పొగమంచు తీవ్రంగా కమ్ముకోవడానికి, ఢిల్లీవాసులు శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోవడానికీ పంజాబ్ రైతులు పొగ పెట్టడమే కారణమట! పంజాబ్ రైతులు లక్షలాది ఎకరాల్లో వరిపంటల అవశేషాలను తగులబెట్టడం వల్లే ఢిల్లీని పొగమంచు కమ్మేస్తోందట. ఢిల్లీని పొగ ఎలా కమ్మేస్తోందో చూపుతున్న ఈ ఉపగ్రహ ఫొటోను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విడుదల చేసింది.
నాసాకు చెందిన ఆక్వా శాటిలైట్ అక్టోబర్ 31న పంజాబ్ మీదుగా ఎగురుతుండగా.. ఆ ఉపగ్రహంలోని ‘మోడిస్(మాడరేట్ రిజల్యూషన్ ఇమేజింగ్ స్పెక్ట్రో-రేడియోమీటర్)’ పరికరం తీసిన ఫొటో ఇది. దీనిలో ఎరుపు రంగు చుక్కల రూపంలో ఉన్నవి పంజాబ్ పొలాల్లో పంట అవశేషాల మంటలు కాగా, కింద ఢిల్లీ మీదుగా తెలుపురంగు మేఘాల్లా కనిపిస్తున్నవి పొగ, ధూళికణాలు, కాలుష్యకారకాలతో కూడిన పొగమంచు మేఘాలు.
కాగా, పంజాబ్‌లో రైతులు మే నెలలో వరి, నవంబరులో గోధుమ పంట వేస్తుంటారు. వరికోతలు అయిన వెంటనే పొలాన్ని సిద్ధం చేసేందుకు పంట అవశేషాలను తగులబెడుతుంటారు. అయితే.. పంజాబ్‌తో సహా కొన్ని రాష్ట్రాల్లో పంట అవశేషాలను తగులబెట్టడం చట్టరీత్యా నేరం.