అతిసారమా.. అలెర్ట్ అవ్వండి!
అతిసారమా.. అలెర్ట్ అవ్వండి!
Published Thu, Aug 3 2017 3:13 AM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM
సాక్షి, తెలంగాణ డెస్క్: డయేరియాను నియంత్రించడంలో ఎంతో ప్రగతి సాధించినా.. వైద్య ప్రమాణాలు చాలా వరకు మెరుగుపడినా.. ఇప్పటికీ దేశంలో చిన్నారుల మరణాలకు డయేరియా ఒక ప్రధాన కారణమట. వివిధ వ్యాధులతో ఏటా మరణిస్తున్న ఐదేళ్లలోపు చిన్నారుల్లో డయేరియా మృతులు రెండో స్థానంలో ఉన్నారట. 2015లో దేశంలో ప్రతి రోజూ సుమారు 321 మంది చిన్నారులు డయేరియాతో మరణించారట. ఈ ఏడాది మేలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెలువరించిన ఫ్యాక్ట్ షీట్(వాస్తవపత్రం) ఈ విషయాలను వెల్లడించింది. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీరుతో డయేరియాను చాలా వరకూ నియంత్రించవచ్చు. కానీ మౌలిక వసతులైన వీటిని ప్రజలకు అందించడంలో భారత్ ఇంకా వెనుకబడే ఉంది.
కలుషిత నీటి వల్లే..
కలుషిత నీరు, అపరిశుభ్రత కారణంగా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల సాయంతో డయేరియా వ్యాపిస్తోంది. డీహైడ్రేషన్(నిర్జలీకరణం), పోషకాహారలోపం, విరేచనాల వల్ల కూడా డయేరియా విస్తరిస్తోంది. 2015లో ప్రపంచవ్యాప్తంగా డయేరియాతో 5,25,000 చిన్నారులు మరణించినట్టు డబ్ల్యూహెచ్‌వో ఫ్యాక్ట్‌షీట్ వెల్లడించింది. పోషకాహార లోపం, వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం మొదలైన కారణాల్లో 132 దేశాల్లో భారత్ 114వ స్థానంలో ఉందని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డయేరియా ఎక్కువసార్లు రావడం వల్ల దీర్ఘకాలంలో చిన్నారుల ఎదుగుదల, సామర్థ్యం, వ్యాధి నిరోధకశక్తిపై ప్రభావం చూపుతోందని, దీనికి పేదరికం కూడా ఒక కారణమని నిపుణులు చెపుతున్నారు.
వోఆర్‌ఎస్‌తో చెక్ పెట్టొచ్చు
సాధారణమైన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (వోఆర్‌ఎస్), జింక్ ట్యాబ్లెట్లతో డయేరియాను నియంత్రించవచ్చని డబ్ల్యూహెచ్‌వో ఫ్యాక్ట్‌షీట్ స్పష్టం చేస్తోంది. వోఆర్‌ఎస్ అంటే స్వచ్ఛమైన నీరు, ఉప్పు, చక్కెర మిశ్రమం. ఇది శరీరంలో కోల్పోయిన నీటిని, ఎలక్ట్రోలైట్స్‌ను భర్తీ చేస్తుంది. జింక్ మాత్రలు డయేరియా ప్రభావిత కాలాన్ని 25 శాతం తగ్గిస్తాయి.
వైద్య ప్రమాణాలు పెరిగినా ఇప్పటికీ డయేరియా మరణాలు ఎక్కువే
డబ్ల్యూహెచ్‌వో ఫ్యాక్ట్‌షీట్‌లో వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా 2015లో ఐదేళ్లలోపు చిన్నారుల మృతి 5,25,000
భారత్‌లో ప్రతి రోజూ మృత్యువాత పడుతున్న చిన్నారులు 321
Advertisement
Advertisement