కోల్‌కతా: దేశ వ్యాప్తంగా ‘‘బాయ్స్ లాకర్ రూం’’ ఉదంతం ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌లోని ఓ యూనివర్సిటీ విద్యార్థులు సైతం ఇదే తరహా అకృత్యాలకు ఒడిగట్టిన విషయం బయటపడింది. ఐయూబ్రోస్ పేరిట ట్విటర్ ఖాతా నిర్వహిస్తున్న ఓ మహిళ సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ(జేయూ)కి చెందిన ఎస్ అనే వ్యక్తి గూగుల్ డ్రైవ్‌లో అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలు పెట్టి.. తన తోటి విద్యార్థులు, స్నేహితులకు వాటిని వీక్షించే వెసలుబాటు కల్పించాడని పేర్కొన్నారు. తోటి విద్యార్థినులతో పరిచయం పెంచుకుని వారితో సన్నిహితంగా మెలుగుతూ ఫొటోలు పంపించాలని ఒత్తిడి చేసేవాడని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ కావడంతో సదరు ఎస్ తమను కూడా ఇలాగే వేధించాడని పలువురు యూనివర్సిటీ విద్యార్థినులు సోషల్ మీడియాలో తమ అనుభవాలు పంచుకున్నారు. 2016లో క్రియేట్ చేసిన ఆ గూగుల్ డ్రైవ్‌ను.. అతడు ఓపెన్ సీక్రెట్‌గా మార్చేశాడని చెప్పుకొచ్చారు. (బాయ్స్ లాకర్ రూం.. డర్టీ ఛాట్)
ఈ విషయం గురించి ఐయూబ్రోస్ ట్విటర్ యూజర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 2015లో ఎస్ అనే వ్యక్తితో తనకు స్నేహం ఏర్పడిందని.. యూనివర్సిటీ డిబేటింగ్ క్లబ్‌లో తామిద్దరం కలిసి పాల్గొనేవాళ్లమని తెలిపారు. ఈ క్రమంలో అతడు తరచూ చాటింగ్ చేసే వాడని.. ఓ రోజు పర్సనల్ ఫొటోలు పంపాలని కోరాడన్నారు. వెంటనే డెలీట్ చేస్తానని చెప్పాడని.. అతడి ఒత్తిడి భరించలేక ఫొటో షేర్ చేశానని చెప్పుకొచ్చారు. అయితే 2018లో తనకు సంబంధించిన అశ్లీల ఫొటోలను ఎస్ గూగుల్ డ్రైవ్‌లో చూశానని ఓ వ్యక్తి చెప్పడంతో షాక్‌కు గురయ్యానని.. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.(ఫొటోలు పెట్టి.. తప్పు చేశానా అమ్మా?)
ఈ క్రమంలో తమ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని తన మీటూ స్టోరీని బహిర్గతం చేయడంతో.. ఆమె కూడా తనలాగే ఎస్ అకృత్యాలకు బలైన విషయం గురించి తెలుసుకున్నానన్నారు. ఎస్ జూనియర్ విద్యార్థినులు కూడా అతడి వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఎస్ తమను లైంగికంగా వేధించాడని.. అయినప్పటికీ అతడికి లొంగకపోవడంతో అందరితో తమ ఫొటోలు షేర్ చేసుకున్నాడని పేర్కొన్నారు. తమ ఫొటోలు ఇప్పటికే జేయూ సర్క్యూట్‌లో ఉండటం షాకింగ్‌గా ఉందని.. అయితే అందులో కొంతమంది ఫొటోలు మాత్రమే ఉన్నట్లు అతడి స్నేహితుడు చెప్పాడని పేర్కొన్నారు.
వ్యక్తిగత విషయం.. ఎలా జరిగిందో తెలియదు
ఈ విషయం గురించి సదరు మీడియా ప్రతినిధులు ఎస్‌ను ప్రశ్నించగా.. తాను గూగుల్ డ్రైవ్‌లో సదరు అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలు స్టోర్ చేసిన మాట వాస్తవేమనని... అయితే అది తన వ్యక్తిగత అంశమని పేర్కొన్నాడు. కానీ తాను ఎన్నడూ వాటిని బయటపెట్టలేదని.. తన ఫోన్ పోగొట్టుకున్న కారణంగా ఈ విధంగా జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అయినప్పటికీ థర్డ్‌పార్టీ తన ఫొటోలు ఎలా చూశారో అర్థం కావడం లేదని వాపోయాడు. 2018లో తన ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని కోల్‌కతాను వీడి వెళ్లినట్లు పేర్కొన్నాడు.(‘ఇన్‌స్టా’లో ‘బాయిస్’ బీభత్సం)
ఇక ఈ విషయంపై స్పందించిన ఐయూబ్రోస్ ట్విటర్ యూజర్ ఎస్‌తో పాటు ‘ఏ’ కూడా ఇందులో భాగ్వస్వామ్యమయ్యాడని.. సెమినార్లు జరుగుతున్న సమయంలో అమ్మాయిల ఫొటోలు తీసి ముఖభాగం మార్ఫ్ చేసేవాడని పేర్కొన్నారు. బాయ్స్ లాకర్ రూం తరహాలో అనేక మంది అబ్బాయిలు.. తమ తోటి విద్యార్థినుల గురించి అసభ్య కామెంట్స్ చేస్తూ.. వారి అశ్లీల చిత్రాలను షేర్ చేసి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. ఇది కేవలం ఢిల్లీ, కోల్‌కతాకే పరిమితం కాదని.. అనేక విద్యా సంస్థల్లో ఇలాంటి వారు ఉన్నారని పేర్కొన్నారు. అమ్మాయిలు ఇలాంటి విషయాల గురించి బయట చెప్పుకోలేరనే భావనతో అకృత్యాలకు ఒడిగడుతున్నారని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసే అంశంపై ఆమె స్పష్టతనివ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment