
ఉదృతంగా ప్రవహిస్తున్న యమునా నది
గత మూడేళ్లుగా ఎన్నడూ లేని రీతిలో నీటిమట్టం 205 మీటర్లకి చేరింది..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. పైన కురుస్తున్న వర్షలతో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత మూడేళ్లుగా ఎన్నడూ లేని రీతిలో ఢిల్లీలో నీటి మట్టం 205 మీటర్లకి చేరింది. హర్యానాలోని హిరాకుడ్ డ్యాం నుంచి శనివారం ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో నది ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సహయక చర్యలను ముమ్మరం చేసింది. ముంపు ప్రాంతాల్లో నివశిస్తున్న 1500 మందిని పునరావాస ప్రాంతాలకు తరలించినట్లు అధికారాలు తెలిపారు.
పునరావాస కేంద్రాలుగా ఇప్పటి వరకు 550 టెంట్లు, 10 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తూర్పు ఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారాలు అప్రమత్తంగా ఉండాలని అదేశించారు. అవసరమైతే పాఠశాలలు, ప్రభుత్వ భవనాలలో ప్రజలకు పునరావాసం కల్పించాలని సీఎం అధికారులుకు సూచించారు. నది ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, లోతట్టులో ఉన్న 10,000 మంది ప్రజలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని నోడల్ అధికారి అరుణ్ గుప్తా తెలిపారు. ప్రజలకు విద్యుత్, ఆహారం, ఇతర సదుపాలయాలను కల్పించాలని సీఎం ఆదేశించారు. సహాయ చర్యలను ముమ్మరం చేయడానికి ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.