ఆ ముద్దుల వ్యవహారంలో మేం వేలు పెట్టం!
మోరల్ పోలీసుంగ్ను నిరసిస్తూ నవంబర్ రెండో తేదీన నిర్వహించాలని తలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. చట్ట విరుద్ధంగా ఏ కార్యక్రమం చేపట్టినా తాము తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కొంతమంది ఫేస్బుక్ యూజర్ల గ్రూపు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని నిషేధించాలంటూ రెండు పిటిషన్లు కేరళ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ కార్యక్రమంలో చట్టవిరుద్ధంగా ఏ కార్యక్రమం జరిగినా.. దాన్ని అడ్డుకోడానికి తగినంత స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఎర్నాకులం ప్రభుత్వ న్యాయకళాశాల, శ్రీ సత్యసాయి అనాథల ట్రస్టులకు చెందిన ఇద్దరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎం షఫీక్లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది.
ఐపీసీలోని నిబంధనలను ఈ కార్యక్రమం ఉల్లంఘిస్తోందని, ఇది భారతీయ సంస్కృతికి కూడా విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యతను నిరోధించాల్సిందిగా ఎర్నాకులం జిల్లా కలెక్టర్, నగర పోలీసు కమిషనర్లను ఆదేశించాలని కోరారు. నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అణగదొక్కడానికి వీల్లేదని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాల ఓ ఫేస్బుక్ పోస్టులో వ్యాఖ్యానించారు. అయితే నిరసనకారులు మాత్రం శాంతిభద్రతల సమస్యను సృష్టించకూడదని ఆయన అన్నారు.
గతవారం కోజికోడ్లోని ఓ హోటల్లో అసభ్య కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ కొంతమంది భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు అక్కడ విధ్వంసం సృష్టించారు. దీనికి నిరసనగానే నవంబర్ రెండో తేదీ ఆదివారం నాడు కౌగిలింతలు, ముద్దులతో బహిరంగ నిరసన నిర్వహించాలని వివిధ పక్షాలు నిర్ణయించాయి.