
'ఆయన భార్యగా అంగీకరించారు.. చాలా సంతోషం'
తనను తొలిసారి భార్యగా అంగీకరించిన తర్వాత మోడీ అత్యున్నత పదవికి చేరుకున్నారని, ఇది తనకు చాలా సంతోషకరమైన వార్త అని, ఆయన భార్య అయినందుకు గర్వపడుతున్నానని యశోదాబెన్ అంటున్నారు.
కొత్త ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారానికి ఒకపక్క వేగంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మరోవైపు ఆయన భార్య యశోదాబెన్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తనను తొలిసారి భార్యగా అంగీకరించిన తర్వాత ఆయన అత్యున్నత పదవికి చేరుకున్నారని ఆమె అంటున్నారు. ఇది తనకు చాలా సంతోషకరమైన వార్త అని, ఆయన భార్య అయినందుకు గర్వపడుతున్నానని, ఆయనెప్పుడూ తలెత్తుకునే ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె అన్నారు. సమయం వచ్చినప్పుడు ఆయన్ని కలవడానికి వెళ్తానని అన్నారు.
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు మోడీ తనను భార్యగా అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన తనను గుర్తుపెట్టుకున్నారని, అందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇంతకు ముందు తన పేరు ఎప్పుడూ చెప్పకపోయినా, పెళ్లి కాలేదని మాత్రం అనలేదని.. అసలు తన గురించి చెడ్డగా ఏమీ మాట్లాడలేదని, అందుకే ఆయనంటే తనకు గౌరవమని యశోదాబెన్ అన్నారు. తానెన్నటికీ ఆయన భార్యగానే ఉండిపోతానని చెప్పారు.
దేశానికి సేవ చేయడం కోసమే ఆయన కుటుంబాన్ని వదిలి వెళ్లారు తప్ప తామేమీ విడాకులు తీసుకోలేదని, విడిపోలేదని స్పష్టం చేశారు. బాల్య వివాహం చేసుకున్న నరేంద్రమోడీ.. యువకుడిగా ఉన్నప్పుడే ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టి తర్వాత ఆర్ఎస్ఎస్లో చేరారు.