న్యూఢిల్లీ : భారత త్రివిధ దళాలు గురువారం సాయంత్రం సంయుక్తంగా సమావేశం అయ్యారు. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పలు కీలక విషయాలపై మీడియాతో సమావేశం నిర్వహించారు. 'భారత సైనిక స్థావరాలపై పాక్ బాంబులు వేసింది. వాయుసేన వేగంగా స్పందించి వాటిని తిప్పికొట్టింది. ఫిబ్రవరి 27న ఉ.10 గంటలకు పాక్ విమానాలు చొరబడడాన్ని గమనించాము. వెంటనే వైమానిక దళం స్పందించింది. మిగ్ 21, సుఖోయ్, మిరాజ్ విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లాయి. మా దాడిలో పాక్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చేశాము. ఈ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూలింది. ఈ ఆపరేషన్‌లో భారత్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్-21ను కోల్పోయాము. రెండు పాక్ విమానాలను భారత్ కూల్చింది. పాకిస్తాన్ అనేక అబద్ధాలు ఆడింది. ఇద్దరు పైలట్లు తమ ఆధీనంలో ఉన్నారని తప్పుడు సమాచారం చెప్పి, ఆ తర్వాత మాట మార్చింది. ఎఫ్-16 విమానాలు వాడలేదంటూ పాక్ కట్టుకథలు చెప్పింది. అయితే ఎఫ్-16 విమానాలు వాడిందనడాకి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. భారత సైన్యం అప్రమత్తంగా ఉండటం వల్ల పాక్ కుట్రలు ఫలించలేదు' అని ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ ఆర్‌జీకే కపూర్ తెలిపారు. ఈ సందర్భంగా పాక్ ఉపయోగించిన విమాన శకలాలను ఆర్మీ మీడియాకు చూపించింది.
'ఎల్‌ఓసీ వెంబడి చాలా ప్రాంతాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తోంది. పాక్ కాల్పులను సమర్థంగా తిప్పికొడుతున్నాం. ఎల్‌ఓసీ వెంట భారత సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది. పాక్ చర్యలు తిప్పి కొట్టేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాము. పధాతిదళాలు నిరంతరాయంగా గస్తీ నిర్వహిస్తున్నాయి' అని ఆర్మీ ఛీఫ్ మేజర్ జనరల్ సురేందర్ సింగ్ మహల్ చెప్పారు. 'ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారతీయ నావికా దళం సర్వసన్నద్ధంగా ఉంది. సముద్రం, భూమి నుంచి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దేశ రక్షణకు నేవీ ఎలాంటి చర్యలు చేపట్టడానికైనా సిద్ధం' అని నేవీ ఛీఫ్ రేర్ అడ్మిరల్ దల్బీర్ సింగ్ గుజరాల్ అన్నారు.
'అభినందన్ రేపు సురక్షితంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాము. జెనీవా ఒప్పందం ప్రకారమే అతన్ని తిరిగి పంపుతున్నారని భావిస్తున్నాము. త్రివిధ దళాలు ఒక్కటై దేశ భద్రతను కాపాడుతాయి. కేవలం ఉగ్ర శిబిరాలపై దాడి చేయడానికి మాత్రమే ఆపరేషన్ చేపట్టాము. కానీ పాక్ మాత్రం భారతీయ మిలిటరీ స్థావరాలపై దాడికి ప్రయత్నించింది. దేశ రక్షణకు, ఈ ప్రాంత పరిరక్షణకు ఆర్మీ కట్టుబడి ఉంది. పాక్ ఏ రకంగా చొరబడటానికి ప్రయత్నించినా గట్టి బుద్ధి చెప్తాము. మా యుద్దం ఉగ్రవాదులతో కొనసాగుతుంది' అని భారత త్రివిధ దళాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment