
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మిలటరీ, ఐఎస్‌ఐ మద్దతుతో ప్రధాని గద్దెనెక్కనున్న ఇమ్రాన్ ఖాన్ కారణంగా.. భారత్‌తో సత్సంబంధాల్లో మార్పు ఉంటుందని ఆశలేమీ పెట్టుకోవద్దని రాజకీయ, మిలటరీ నిపుణులు హెచ్చరించారు. ‘ఆయన ఆర్మీ మనిషి. పాక్ ఆర్మీ చెప్పింది చేయడమే ఆయన పని’ అని పాకిస్తాన్‌లో భారత మాజీ దౌత్యవేత్త జి. పార్థసారథి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సమర్థించారు.
ఇమ్రాన్ నాయకత్వంలో పాకిస్తాన్ ఆలోచనాధోరణిలో మార్పు ఉండబోదన్నారు. భారత్‌లోనూ మరో 10 నెలల్లో ఎన్నికలున్నందున మోదీ ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌తో దోస్తీకి పాకులాడే ప్రయత్నం చేయకపోవచ్చని మరో మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్ నాయకత్వంలో భారత్–పాక్ ఉద్రిక్త పరిస్థితుల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పరోక్షయుద్ధాన్ని కొనసాగిస్తుందన్నారు.