నో ప్రోబ్లం.. మెట్రోనే నయం!
సాక్షి, ముంబై: పెరిగిన మెట్రో చార్జీలు ముంబైకర్లపై అంతగా ప్రభావం చూపించనట్లే కనిపిస్తోంది. వర్సోవ-అంధేరి-ఘాట్కోపర్ (11.04 కి.మీ) మెట్రో రైలు చార్జీలు గత మంగళవారం నుంచి పెరిగిన విషయం తెలిసిందే. చార్జీలు రూ.10-15-20 పెంచినప్పటికీ రోజూ మెట్రోను ఆశ్రయించే ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా స్మార్ట్ కార్డ్ కలిగిన ప్రయాణికులు చివరి (లాస్ట్) స్టేజీ వరకు కేవలం రూ.15 చెల్లించి ప్రయాణించవచ్చు. కాగా, స్మార్ట్ కార్డుల విక్రయాలు పెంచేందుకు తక్కువ చార్జీలను వసూలు చేస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మెట్రో రైలు ఆరంభమై నెల రోజులు గడచిన తర్వాత ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) అధికారులు కొత్త చార్జీలను ప్రకటించారు.
మున్ముందు ప్రయాణికుల స్పందనను బట్టి చార్జీలను రూ. గరిష్టంగా రూ.40 పెంచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం గరిష్ట చార్జీల పెంపకాన్ని నిలిపివేశామని అధికారి తెలిపారు. ఇదే గమ్యానికి బెస్ట్ బస్సులు వసూలుచేస్తున్న గరిష్ట చార్జీలతో పోలిస్తే ప్రస్తుతం పెంచిన మెట్రో రైలు చార్జీలు తక్కువేనని అధికారి అభిప్రాయపడ్డారు. కాగా, చార్జీలను పెంచిన మొదటి రోజు ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని అధికారి తెలిపారు. కాగా, ఈ మెట్రో రైలు ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తోందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సందర్భంగా విజయ్ వాఘేలా అనే ప్రయాణికుడు మాట్లాడుతూ.. ఈ మెట్రోను తూర్పు-పశ్చిమ శివార్లను అనుసంధానం చేసే ఫాస్ట్ రైలుగా అభివర్ణించారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతున్నామని, ఎక్కువ చార్జీలు విధించినా తప్పులేదని అభిప్రాయపడ్డారు. చార్జీలు గరిష్టంగా రూ.40 పెరిగినా ప్రయాణికులు పెద్దగా పట్టించుకునే అవకాశాలు తక్కువేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరో ప్రయాణికుడు రత్నాకర్ సావంత్ మాట్లాడుతూ...ఒక నెల తర్వాత మెట్రో చార్జీలు పెంచనున్నట్లు ప్రయాణికులకు మొదటి నుంచి సమాచారం ఉండటం వల్ల పెరిగిన చార్జీలకు మానసికంగా సిద్ధపడే ఉన్నారని పేర్కొన్నారు. దీనికితోడు స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు డిస్కౌంట్ ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. దీంతో టికెట్ కోసం భారీ క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా పోయిందని తెలిపారు. మెరుగైన సౌకర్యాలు అందజేస్తున్నప్పుడు రవాణా విషయంలో చార్జీలు పెంచినా ఎవ్వరూ ఏమీ అనుకోరని అభిప్రాయపడ్డారు. కాకపోతే చార్జీలను పెంచడం ద్వారా జాయ్ రైడ్ కోసం వచ్చే ప్రయాణికుల సంఖ్య తగ్గుతుందని మరో ప్రయాణికుడు తెలిపారు.