50 వేలకు చేరువలో... | India coronavirus death toll stand at 1694 Cases And 49,391 Total cases | Sakshi
Sakshi News home page

50 వేలకు చేరువలో...

Published Thu, May 7 2020 3:32 AM | Last Updated on Thu, May 7 2020 3:47 AM

India coronavirus death toll stand at 1694 Cases And 49,391 Total cases - Sakshi

కర్ణాటకలోని చిక్‌మగళూరులో తాము ఇన్నాళ్లూ నివాసం ఉన్న గుడిసెను ఖాళీ చేసి, స్వస్థలాలకు పయనమవుతున్న వలస కూలీలు

న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా కల్లోలం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ మహమ్మారి కాటు వల్ల మరణాలు, పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు.. 24 గంటల వ్యవధిలో 126 మంది మృతి చెందారు. అలాగే కొత్తగా 2,958 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా సంబంధిత మరణాలు 1,694 కు, పాజిటివ్‌ కేసులు 49,391కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. యాక్టివ్‌ కరోనా కేసులు 33,514 కాగా, గత 24 గంటల్లో 1,457 మంది కరోనా బాధితులు చికిత్సతో కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 14,183కు చేరిందని, రికవరీ రేటు 28.72 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ  వెల్లడించింది.  

548 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి కరోనా  
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 548 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. వీరంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారే. అయితే, వీరికి కరోనా ఎలా సోకిందన్న విషయాన్ని కేంద్రం నిర్ధారించలేదు. కరోనాతో కొందరు డాక్టర్లు కూడా మరణించారు. ఎంతమంది చనిపోయారో కేంద్రం బయట పెట్టడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో 69 మంది వైద్యులకు కరోనా సోకింది.  

ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్ల ఎగుమతిపై నిషేధం  
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే వ్యూ హంలో భాగంగా ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషే ధం విధించింది. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(డీజీఎఫ్‌టీ) బుధవారం నోటి ఫికేషన్‌ జారీ చేశారు. ఈ తరహా శానిటైజర్లను విదేశాలకు ఎగుమతి చేయకుండా, భారత్‌లోనే  విస్తృతంగా అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.  

గుజరాత్, మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళకరం  
గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కరోనా సంబంధిత మరణాలు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం గుజరాత్‌ ఆరోగ్య శాఖ మంత్రి నితిన్‌భాయ్‌ పటేల్, మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపేతో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై చర్చించారు. కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని ముందుగానే గుర్తించి, చికిత్స అందించాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement