మనకూ 'బుల్లెట్'
- ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గానికి రూ. 98,000 కోట్ల జపాన్ సాయం
- భారత ఆర్థిక వ్యవస్థ ఇక పరుగులు పెడుతుంది: ప్రధాని మోదీ
- మేకిన్ ఇండియాకు 12 బిలియన్ డాలర్ల నిధి: షింజో అబే
- భారత్-జపాన్ విజన్ 2025పై సంయుక్త ప్రకటన
- పౌర అణుశక్తి సహకారం, రక్షణ రంగాల్లో కీలక ఒప్పందాలు
న్యూఢిల్లీ: భారత్-జపాన్ మధ్య వ్యూహాత్మక, ద్వైపాక్షిక భాగస్వామ్యం కొత్త రెక్కలు తొడిగింది. జపాన్ ప్రధాని షింజో అబే, భారత ప్రధాని మోదీ మధ్య శనివారం ఢిల్లీలో జరిగిన భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సు.. రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసింది. భారత్‌లో తొలి బుల్లెట్ రైలుతోపాటు పౌర అణు ఒప్పందం, రక్షణ రంగంలో కీలక సహకారం వంటి ముఖ్యమైన 16 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసుకున్నాయి.
ఇందులో ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం సంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం వంటి ఒప్పందాలూ ఉన్నాయి. భారత ఆర్థిక రాజధాని ముంబై - గుజరాత్ ముఖ్య వ్యాపార కేంద్రం అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటుకు 12 బిలియన్ డాలర్ల (రూ. 98వేల కోట్లు) ప్యాకేజీ ఇవ్వటంతో పాటు సాంకేతికంగా పూర్తి సహకారం అందించేందుకు జపాన్ అంగీకరించింది. ఈ ఒప్పందం చారిత్రాత్మకమని.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ కలలను జపాన్ అర్థం చేసుకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేదన్నారు. తొలి బుల్లెట్ రైలు కల సాకారానికి సహాయం చేస్తున్న జపాన్ ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
‘ఈ ఒప్పందం భవిష్యత్తులో భారత రైల్వే వ్యవస్థ అభివృద్ధికి నాంది పలకనుంది. భారత ఆర్థిక వ్యవస్థ మార్పుకు ‘బుల్లెట్ రైలు ఒప్పందం’ ఇంజన్ వంటిద’ని మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 50 ఏళ్ల కాల వ్యవధికి.. 0.1 శాతం వడ్డీతో 80 శాతం నిధులను (రూ.98వేల కోట్లు) జపాన్ అందించనుంది. దీంతో పాటు పౌరఅణు ఒప్పందంలో సహకారం, రక్షణ రంగ సాంకేతికత ఇచ్చిపుచ్చుకోవటంపైనా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలతో పాటు.. దక్షిణ చైనా సముద్రం, ఉగ్రవాదం, ఐక్యరాజ్యసమితి సంస్కరణలు మొదలైన అంశాలపైనా ఇద్దరు ప్రధానులు చర్చించారు. ‘భారత్-జపాన్ విజన్ 2025; ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం-భారత, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుహృద్భావం నెలకొనేందుకు సంయక్తంగా పనిచేయటం’పై సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోవటంతోపాటు తూర్పు ఆసియా ప్రాంతంలో భద్రత, శాంతి నెలకొల్పటం.. దక్షిణ చైనా సముద్ర వివాదంలో 2002లో చేసుకున్న ఒప్పందానికే కట్టుబడి ఉండాలని మోదీ-అబేలు నిర్ణయించారు. - ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (డీఎంఐసీ) ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించటంపై చర్చించారు. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీ) పనుల్లో అభివృద్ధిపై ఇద్దరు ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి దశలో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం.. ఇందుకు అవసరమైన నిధులపై మోదీ-అబే చర్చించారు.
మోదీ: ఈ సదస్సుతో భారత్-జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడనున్నాయి. అపెక్ సభ్యత్వం విషయంలో సహకరించిన అబేకు కృతజ్ఞతలు తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనూ శాశ్వత సభ్యత్వం సాధిస్తాం. ప్రపంచ శాంతి, భద్రత విషయంలో కొత్త భాగస్వామ్యానికి జపాన్‌తో పౌర అణుశక్తి సహకార ఒప్పందం తోడ్పడుతుంది. రక్షణ రంగంలో చేసుకున్న ఒప్పందాలు ఇరు దేశాల సైన్యం పరస్పర సహకారానికి కీలకం. ఈ సదస్సులో వివిధ విభాగాల్లో ప్రత్యేక భాగస్వామ్యానికి గుర్తుగా జపాన్ పౌరులకు మార్చి 1 2016 నుంచి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పించనున్నాం
అబే: ‘మేకిన్ ఇండియా’కు సహకారం అందించేందుకు 12 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేశాం. జపాన్ తయారీరంగ కంపెనీలు భారత్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఈ నిధులను వినియోగిస్తాం. దీంతోపాటు విదేశీ అభివృద్ధి సాయం (ఓవర్సీస్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ టు ఇండియా) కింద భారత్‌కు మరో 5 బిలియన్ డాలర్లు అందిస్తాం. భారత్‌లో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులతోపాటు.. 13 జపాన్ పారిశ్రామిక వాడల (జపాన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్స్) అభివృద్ధికి సహకరిస్తాం.
భారత్-జపాన్ మధ్య జరిగిన 16 ఒప్పందాలు:
- 1. శాంతియుత వినియోగానికి పౌర అణుశక్తి సహకార ఒప్పందం
- 2. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందం
- 3. రక్షణ రంగంలో పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం మార్పునకు ఒప్పందం
- 4. పరస్పర మిలటరీ సమాచారం మార్పిడి చేసుకునే ఒప్పందం
- 5. రెండు దేశాల మధ్య డబుల్ టాక్సేషన్ తొలగింపు ఒప్పందం
- 6. భారత రైల్వేలు, జపాన్ మౌలిక వసతుల మంత్రిత్వ శాఖల మధ్య సహకార ఒప్పందం
- 7. భారత్‌లో పర్యావరణ అనుకూల, ప్రమాద రహిత రైల్వే వ్యవస్థకోసం జపాన్ రైల్వే మంత్రిత్వ శాఖతో ఒప్పందం
- 8. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారం.
- 9. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు యువ పరిశోధకుల పరస్పర మార్పును సహకారం.
- 10. భారత సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ విభాగం, జపాన్ ఆరోగ్య శాఖ మధ్య సహకారం.
- 11. ఇరు దేశాల మానవ వనరుల మంత్రిత్వ శాఖల మధ్య సంస్కృతి, క్రీడలు, వివిధ రంగాల్లో పరస్పర సహకారం
- 12. నీతి ఆయోగ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎకనామిక్స్ ఆఫ్ జపాన్ మధ్య ఒప్పందం
- 13. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తోయామా ప్రిఫెక్షర్ మధ్య పరస్పర సహకార ఒప్పందం
- 14. కేరళ ప్రభుత్వం, జపాన్‌లోని మూడు నగరాల మేయర్ల మధ్య అభివృద్ధి ఒప్పదం.
- 15. ఐఐఎం అహ్మదాబాద్, జపాన్ నేషనల్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలసీ మధ్య ఒప్పందం
- 16. భారత పర్యావరణ శాఖ, జపాన్ వ్యవసాయ, అటవీ శాఖ మధ్య సహకారం.