
ఇండిగో సిస్టమ్స్ డౌన్..గంటన్నర తర్వాత సేవల పునరుద్ధరణ..
సాక్షి, న్యూఢిల్లీ : సాంకేతిక సమస్యలతో అన్ని విమానాశ్రయాల్లో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిస్టమ్స్ డౌన్ అయ్యాయి. సాంకేతిక కారణాలతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు గమ్యస్ధానాలకు చేరవలసిన ప్రయాణీకులు ఎయిర్‌పోర్టులో చిక్కుకున్నారు. సిస్టమ్స్ డౌన్ అవడంతో వివిధ విమానాశ్రయాల్లో ప్రయాణీకులు నిలిచిపోయారని, సంయమనంతో తమకు సహకరించాలని ప్రైవేట్ ఎయిర్‌లైనర్ ట్వీట్ చేసింది.
సమస్యను త్వరలోనే అధిగమిస్తామని, అప్పటివరకూ సంస్థకు సహకరించాలని ప్రయాణీకులను కోరింది. 90 నిమిషాల పాటు సిస్టమ్స్ పనిచేయక పోవడంతో ప్రయాణీకులకు ఎదురైన అసౌకర్యానికి మన్నించాల్సిందిగా ఇండిగో కోరింది. సాంకేతిక సమస్యను పరిష్కరించిన మీదట విమానాల రాకపోకలను పునరుద్ధరించారు.