
మరింత మెరుగ్గా జయ ఆరోగ్యం!
- మాట్లాడేందుకు ప్రయత్నించిన సీఎం
- మాజీ గవర్నర్ రోశయ్య,కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాళ్ పరామర్శ
- జయ ఆరోగ్యంపై బెంగతో మరొకరు ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆస్పత్రిలో 23 రోజులగా చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం శుక్రవారం నాటికి మరింత మెరుగుపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చిన్నపాటి గొంతుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. లండన్ నుంచి వచ్చిన వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బిలే, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం రోజుకు రెండుసార్లు అపోలో వద్దకు వచ్చి జయ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. చికిత్సకు జయలలిత స్పందిస్తున్నందున అవసరమైనపుడు మాత్రమే వెంటిలేటర్‌ను అమరుస్తున్నారు.కాగా తమిళనాడు రాజకీయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని హోంశాఖ ఉన్నతాధికారి స్పష్టం చేశారు.సీఎం జయ అనారోగ్యంపై అవమానకరంగా మాట్లాడిన నేరంపై కోయంబత్తూరు జిల్లాకు చెందిన సురేష్, రమేష్ అనే ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను శుక్రవారం అరెస్ట్ చేశారు. జయలలిత ఆరోగ్యంపై దిగులుపెట్టుకున్న మరో ఇద్దరు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒకరు మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతున్నారు.
నేరుగా చూడలేదు: రోశయ్య
ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు తమిళనాడు మాజీ గవర్నర్ కే రోశయ్య శుక్రవారం రాత్రి అపోలో ఆస్పత్రికి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జయలలిత వద్దకు ఎవ్వరినీ అనుమతించడం లేదనీ, తనకూ నేరుగా చూసే అవకాశం కలగలేదన్నారు. వైద్యుల సమాచారం ప్రకారం ఆమె బాగా కోలుకుంటున్నారని చెప్పారు. సీఎంగా జయ మళ్లీ బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాళ్ కూడా శుక్రవారం ఆస్పత్రికి వచ్చారు. శశికళను కలుసుకుని మాట్లాడారు. కాగా అమ్మ కోలుకోవాలని కోరుకుంటూ అన్నాడీఎంకే నేతలు అనేక ఆలయాల్లో ప్రార్థనలు, పేదలకు అన్నదానాలు నిర్వహించారు.
పన్నీర్ సెల్వంతోస్టాలిన్ భేటీ
ప్రతిపక్ష నేత స్టాలిన్ శుక్రవారం ఉదయం సచివాలయంలో మంత్రి పన్నీర్ సెల్వంతో భేటీ అయ్యారు.రాష్ట్రంలోని రైతన్నల కన్నీరు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కావేరీ అంశంలో ప్రజలు ఏకతాటిపై ఉన్నారని కేంద్రానికి తెలియజేయాలని, సుప్రీం తీర్పును కర్ణాటక ప్రభుత్వం ధిక్కరించడాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా ఖండించే విధంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. అసెంబ్లీ అత్యవసర సమావేశాలు జరిపి కావేరీపై తీర్మానాన్ని ఆమోదించాలని డీఎంకే చేసిన తీర్మానాల ప్రతిని పన్నీర్ సెల్వంకు అందజేశానని స్టాలిన్ చెప్పారు.