జూడాల సమ్మె
ప్రభుత్వం వైద్య విద్యార్థులకు చెల్లించే స్కాలర్‌షిప్పు మొత్తాన్ని పెంచాలని కొంతకాలం నుంచి జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌పై రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి సమ్మెకు దిగారు. విధులను బహిష్కరించి తమ డిమాండ్ నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు ప్రకటించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నైలోని జీహెచ్, స్టాన్లీ, రాయపేట, కేఎంసీ ఆస్పత్రుల వద్దకు ఉదయం 8 గంటలకు చేరుకున్న విద్యార్థులు గేట్ల ముందు ధర్నాకు దిగారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఆందోళనలు చేశారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్యసేవలు స్తంంభించిపోయాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులను సీనియర్ వైద్యులు పరీక్షలు చేసిన పిదప వారి సూచనల ప్రకారం వైద్యం కొనసాగించే బాధ్యత జూనియర్ డాక్టర్లదే. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్ల సేవలు ఎంతో కీలకం. అకస్మాత్తుగా వేలాది మంది జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో వైద్య సేవలు స్తంభించిపోయాయి.
స్టాఫ్ నర్సులే రోగుల బాధ్యతలను తీసుకోవలసి వచ్చింది. దీంతో సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. జూడాలు ఉంటున్న ప్రభుత్వ వసతి గృహాలను వెంటనే ఖాళీచేయాలని సైతం ఆదేశించింది. దాదాపు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని తాము ముందుగానే ఊహించినా తప్పలేదని చెన్నై ఆందోళనలకు నాయకత్వం వహించిన ఇలియా జానకిరామన్ అనే జూనియర్ డాక్టర్ సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులకు తెలిపారు. వైద్య కళాశాలల్లోని డిగ్రీ విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం రూ.8,400, పీజీ విద్యార్దులకు రూ.17,400 చెల్లిస్తోందని, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ మొత్తం చాలా తక్కువని ఆమె పేర్కొన్నారు.
ఇదే డిమాండ్‌పై ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించగా, అధికారులతో అప్పుడు జరిగిన చర్చలు విఫలమయ్యూయని ఆమె చెప్పారు. ఆ తరువాత ప్రభుత్వం స్పందించనందున ఈనెల 17న ఒక్కరోజు సమ్మె పాటి ంచామని తెలిపారు. అయితే ప్రభుత్వం ఏమాత్రం తమ డిమాండ్‌పై స్పందించక పోవడంతో నిరవధిక సమ్మె చేపట్టాలని ఆదివారం అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
జూనియర్ డాక్టర్లకు (పీజీలకు) నెలకు ఢిల్లీలో రూ.71, 500, ఉత్తరప్రదేశ్‌లో రూ.55,370, కేరళలో 32 వేలు చెల్లిస్తుండగా తమిళనాడులో కేవలం రూ.17,400 చెల్లించడం అన్యాయమని ఆమె అంటున్నారు. డిమాండ్ నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని ఆమె చెప్పారు. ఇక మంత్రులతో సైతం చర్చలకు తావులేదని, స్కాలర్ షిప్పులు పెంచాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.