అరచేతిలో స్వర్గం చూపే రాజకీయాలు మానుకోండి
తిరుపతి కార్పొరేషన్ : ఏప్రభుత్వం వచ్చినా జూనియర్ డాక్టర్లను వాడుకుని వదిలేస్తున్నారని, ఇప్పటికైనా అరచేతిలో స్వర్గం చూపే రాజకీయాలు మానుకోవాలని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. ఏపీ జూడాలు చేపట్టిన సమ్మె బుధవారానికి మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున రుయా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. జూడాలను ప్రభుత్వం చర్చలకు పిలవనందుకు నిరసనగా జూడాలు నోటికి నల్ల రిబ్బను కట్టుకుని, మానవహారంగా రుయా సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. జూడాలు మాట్లాడుతూ ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల సహనాన్ని పరీక్షిస్తోందన్నారు.
కేరళలో జూనియర్ డాక్టర్లకు వేతనాలు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఇస్తున్నారని తెలిపారు. ఒక సంవత్సరం రూరల్ సర్వీసుకు గుర్తింపునిస్తూ, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తారని, మన రాష్ట్రంలో అలాంటి గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమన్నారు. పైగా ‘కంపల్‌సరి బాండెడ్ లేబర్ సర్వీస్’ పేరుతో వైద్య విద్యార్థులను ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోందన్నారు. తమ ఉద్యమాన్ని పరీక్షిస్తే అవసరమైతే అత్యవసర సేవలను కూడా నిలిపేస్తామని వారు హెచ్చరించారు.
సమ్మెకు పిలిస్తే ర్యాగింగ్ కేసులు?
వైద్యవిద్యా ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రమణ్యం జిల్లాలో సోమ, మంగళవారాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో జూడాల సమ్మెను అడ్డుకోవడానికి తిరుపతి ఎస్వీ మెడికల్ కళాళాశాల ఉన్నతాధికారి తీవ్ర ప్రయత్నాలు చేశారు. సమ్మెలో పాల్గొనవద్దంటూ ఆయన అన్ని విభాగాల హెచ్‌వోడీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
బుధవారం ఉదయం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను తన చాంబర్‌కు పిలుపించుకున్న సదరు ఉన్నతాధికారి సమ్మెకు వెళ్లకూడదని, వెళ్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని చెప్పినట్టు సమాచారం. సమ్మెకు రావాలని సీనియర్లు పిలిస్తే మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారంటూ తమకు ఫిర్యాదు చేయాలని వారికి చెప్పినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ వైద్యులు సదరు ఉన్నతాధికారిని నిలదీసినట్టు సమాచారం.