అక్షరాలా కోటి రూపాయలను అందిస్తూ ఇప్పటివరకు ఏడు సీజన్ల పాటు విజయవంతంగా సాగిన 'కౌన్ బనేగా కరోడ్పతి' కార్యక్రమం ఎనిమిదో సీజన్ కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆగస్టు నెలలో ఈ కార్యక్రమ ప్రసారాలను ప్రారంభిస్తున్నట్టు బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తెలిపారు. సోమవారం రాత్రి ఆయన తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఈ విషయం తెలిపారు. 'కౌన్ బనేగా కరోడ్పతి' కొత్త ముఖం ఆగస్టులో ప్రసారం అవుతుందని ఆయన తెలిపారు. 71 ఏళ్ల అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్, ఫేస్బుక్, ట్విట్టర్.. ఇలాంటి సామాజిక మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చెబుతుంటారు. అలాగే ఈసారి కూడా ఈ విషయాన్ని ఆయన తన సామాజిక మీడియాతోనే చెప్పారు.
''ఇది కేబీసీ కొత్త ఆకారం. కేబీసీ కొత్త ముఖం ఆగస్టులో ప్రారంభం అవుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు అప్రతిహతంగా జరిగాయి. ఒక్క సీజన్ మాత్రం షారుక్ఖాన్ చేశారు'' అని ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. తానెంత పెద్ద నటుడైనా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ గేమ్షోకు వచ్చేవారిని ఆయన సాదరంగా ఆహ్వానిస్తూ వారిని ప్రోత్సహించి, అనేకమందిని ఇప్పటికి కోటీశ్వరులను చేశారు. ''ఇక్కడ కేవలం డబ్బులు మాత్రమే కాదు.. హృదయాలు కూడా గెలచుకుంటారు. ప్రతి ఒక్క పోటీదారు నా హృదయాన్ని గెలుచుకుని వెళ్తుంటారు.. మీ అందరికీ ప్రేమతో'' అంటూ అమితాబ్ పోస్ట్ చేశారు. సోనీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ షోను ప్రసారం చేయనుంది. కేబీసీ స్ఫూర్తితోనే తెలుగులో నాగార్జున హోస్ట్గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్షో ప్రస్తుతం ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అందులో ఇప్పటివరకు అత్యధికంగా 12.50 లక్షలను మాత్రమే గెలుచుకోగలిగారు.
ఆగస్టులో కేబీసీ 8 ప్రారంభం: అమితాబ్
Published Tue, Jun 24 2014 12:14 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM