న్యూఢిల్లీ: దేశరాజధానిలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ(ఎన్‌ఎంఎంఎల్)లో భారత మాజీ ప్రధానులందరికీ కేంద్రం చోటు కల్పించాలని అనుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదనీ, మొత్తం దేశానికి సంబంధించిన వారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్‌ఎంఎంఎల్ ఉన్న తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో జోక్యం చేసుకోవద్దని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి మన్మోహన్ లేఖ రాశారు.
‘ప్రజల మనోభావాలను గౌరవించి తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో ఉన్న నెహ్రూ స్మారక మ్యూజియంను అలాగే ఉంచండి. దీనివల్ల దేశ చరిత్రను, వారసత్వాన్ని గౌరవించినవారు అవుతారు. నెహ్రూ కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు మొత్తం దేశానికి సంబంధించినవారు. నెహ్రూ ఔన్నత్యం, గొప్పతనాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. బీజేపీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. కానీ ప్రస్తుతం భారత ప్రభుత్వం దీన్ని మార్చాలనుకుంటోంది’ అని మన్మోహన్ లేఖలో తెలిపారు. భారత తొలి ప్రధానిగా నెహ్రూ దేశం, ప్రపంచంపై గొప్ప ప్రభావం చూపారని మన్మోహన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment