నాలుగు రోజుల్లో 5వేల కోట్లు!
సహకార బ్యాంకులలో కూడా పాత 500, 1000 రూపాయల నోట్లను జమ చేసుకోవచ్చని అలా చెప్పారో లేదో.. సరిగ్గా నాలుగంటే నాలుగే రోజుల్లో మహారాష్ట్రలో్ని సహకార బ్యాంకులలో ఏకంగా 5వేల కోట్లు జమయ్యాయి. వీటిలో చాలావరకు రైతుల ఖాతాలే ఉంటాయి. కానీ ఒక్కసారిగా ఇంత పెద్దమొత్తం డిపాజిట్ కావడంతో ఇప్పుడు వీటిలో ఏవైనా అనుమానిత లావాదేవీలు ఉన్నాయేమోనని నాబార్డ్ పరిశీలించనుంది. కొన్ని ఖాతాల్లో లెక్కల్లోకి రాని డబ్బులను డిపాజిట్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం రాష్ట్రంలో 31 డీసీసీబీలు ఉన్నాయి. అవన్నీ స్థానిక నాయకుల చేతుల్లోనే నడుస్తున్నాయి. నవంబర్ నెలలో కేవలం నాలుగు రోజులు మాత్రమే ఈ బ్యాంకులలో రద్దయిన నోట్ల డిపాజిట్లకు రిజర్వు బ్యాంకు అనుమతించింది. మొత్తం 3800 శాఖల్లో కలిపి ఈ నాలుగు రోజుల్లో సుమారు రూ. 5వేల కోట్ల సొమ్ము డిపాజిట్ అయ్యింది. ఈ బ్యాంకులలో ఆ నాలుగు రోజుల తర్వాత డిపాజిట్లను అనుమతించలేదు. వారానికి రూ. 24వేలు డ్రా చేసుకోడానికి మాత్రమే అక్కడ వీలుంది.
మొదట్లో 2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్ చేసిన ఖాతాలను మాత్రమే పరిశీలిస్తామని, తర్వాత ఆ నాలుగు రోజుల్లో డిపాజిట్లు వచ్చిన మొత్తం ఖాతాలను పరిశీలిస్తామిన రాష్ట్ర సహకారశాఖ అధికారి ఒకరు తెలిపారు. గత కొన్నేళ్లుగా ఆయా ఖాతాల్లో ఉన్న సగటు బ్యాలెన్స్, గతంలో జరిగిన లావాదేవీలకు.. ఇప్పటి డిపాజిట్లకు అసలు ఏమాత్రం సంబంధం లేదని నాబార్డ్ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఖాతాదారు కేవలం లక్ష రూపాయలే డిపాజిట్ చేసినా.. అంతకుముందు లావాదేవీలు, బ్యాలెన్స్ చూస్తే అది వేలల్లోనే ఉంటే ఇప్పుడు ఈ లక్ష రూపాయలకు ఎలా సమాధానం చెబుతారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇస్లామాపూర్, షిరాలా, తస్‌గావ్ శాఖలలోని ఖాతాలను గత వారం పరిశీలించారు. సంగ్లి డీసీసీబీలో సుమారు 320 కోట్ల పాతనోట్లు డిపాజిట్ అయ్యాయి. పుణె బ్రాంచిలో అయితే ఏకంగా 600 కోట్లు డిపాజిట్ అయ్యాయి.