సాక్షి, న్యూఢిల్లీ: కేరళకు నైరుతి రుతపవనాలు ఈ ఏడాది నాలుగైదు రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. జూన్ 5న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా, ఈ ఏడాది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 12 గంటలలో అదే ప్రాంతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతములో మే 16 వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ప్రారంభంలో మే 17 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణించి, తరువాత మే 18 నుండి 20 వ తేదీలలో ఉత్తర ఈశాన్య దిశగా ఉత్తర బంగాళాఖాతం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. రాగల 48 గంటలలో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మరియు నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో ఇవాళ (శుక్రవారం) ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 కిలో) తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40కిలోమీటర్ల) తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment