ముంబైః స్వచ్ఛభారత్ అభియాన్ పథకంలో భాగంగా గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీజీబీ) రెండు ప్రాంతాల్లో బయో డైజెస్టర్ టాయిలెట్లను ప్రారంభించింది. ఈ ఆధునిక సాంకేతిక మరుగుదొడ్లను శివశేన ఎంపీ రాహుల్ శేవాలే ప్రారంభించారు. గ్రేటర్ ముంబైలోని ధారవి, మాహిమ్ ప్రాంతాల్లో బయో డైజెస్టర్ టాయిలెట్లను ప్రారంభించారు. ఈ రెండు టాయిలెట్లలో మొత్తం 30 సీటింగ్ బ్లాక్స్ కలిగిన ఉన్నట్లు తెలిపారు. ఇటువంటి బయో డైజెస్టింగ్ మరుగుదొడ్లను మరిన్ని వార్డుల్లో ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు సివిక్ బాడీ ప్రణాళికలు చేస్తున్నట్లు ఎంసీజీఎం అసిస్టెంట్ కమిషనర్ రమాకాంత్ బిరదర్ తెలిపారు.
బయో డైజెస్టర్ మరుగుదొడ్లలో చెడు వాసన వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, ఎక్కువ నీరు కూడా అవసరం లేకుండానే శుభ్రంగా ఉంచుకునే అవకాశం ఉంటుందని ఎంసీజీఎం కమిషనర్ తెలిపారు. ఇటువంటి బయో టాయిలెట్లకు సేవేజ్ లైన్లతో కనెక్షన్లు, సెప్టిక్ ట్యాంకులవంటివి కూడా అవసరం లేదన్నారు. ఈ అధునాతన టాయిలెట్లను స్వచ్ఛభారత్ అభియాన్ నిధులతో పాటు, ఎన్జీవోల సహకారంతో నిర్మించినట్లు బిరదర్ తెలిపారు. ఈ టాయిలెట్లలో బొద్దింకలు, ఈగలవల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉండదని, బయో డైజెస్టర్ టాయిలెట్లలో సాలిడ్ వేస్ట్ తీయాల్సిన అవసరం కూడా ఉండకపోవడంతో ఎక్కువగా నిర్వహణ ఖర్చు ఉండదని సివిక్ బాడీ అధికారులు పేర్కొన్నారు. పే అండ్ యూజ్ పద్ధతిలో వీటిని వాడకంలోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు.
ముంబైలో బయో డైజెస్టర్ టాయిలెట్లు..
Published Tue, Oct 4 2016 9:16 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
Advertisement
Advertisement