బ్రిస్బేన్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
బ్రిస్బేన్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ చేరుకున్నారు. జీ 20 సదస్సులో పాల్గొందుకు వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మరికాసేపట్లో మోదీ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బోట్ తో భేటీ కానున్నారు. నేడు ఆయన ఆస్ట్రేలియా పార్లమెంట్లో ప్రసంగిస్తారు. ప్రధాని అయిదు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు.కాగా దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రధాని ఆస్ట్రేలియాలో అధికారికంగా పర్యటించటం విశేషం. 1986లో అప్పటి ప్రధాని రాజీవ్ పర్యటన తర్వాత భారత్ నుంచి ఎవరూ అధికారికంగా పర్యటించలేదు.
ఈ పర్యటనలో భాగంగా మోదీ, జీ-20 సదస్సులో పాల్గొనడంతో పాటు అక్కడి ప్రవాస భారతీయులతోనూ సమావేశం కానున్నారు. సిడ్నీలో ఏర్పాటు చేసే బహిరంగ సభలోనూ మోదీ మాట్లాడనున్నారు. ఇలా ఆస్ట్రేలియాలో ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడిన తొలి ఇతర దేశ ప్రధానిగా మోదీ రికార్డు నమోదు చేయనున్నారు. ఇక శనివారం నుంచి ప్రారంభం కానున్న జీ-20 సదస్సులో.. నల్లధనంపై పోరులో అంతర్జాతీయ సహకార ఆవశ్యకతను ప్రముఖంగా మోదీ ప్రస్తావించనున్నట్లు సమాచారం. జీ-20, ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా సదస్సుల్లో ఆసియా, ఆఫ్రికా, యూరప్ తదితర ఖండాల దేశాలకు చెందిన 40 మంది నేతలను ఆయన కలుసుకుంటారు.