సాక్షి, ముంబై: ఇటీవల నావల్ డాక్‌యార్డులో సంభవించిన భారీ పేలుడు దుర్ఘటనలో చిక్కుకున్నవారు బతికుండే ఆశలు దాదాపుగా అడుగంటడంతో ఇక నీటిలో మునిగిపోయిన జలాంతర్గామి ఐఎన్‌ఎస్ ‘సింధురక్షక్’ను బయటకు తీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అందుకు నేవీ విభాగం జాతీయ, అంతర్జాతీయ కంపెనీల సాయం తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది. అయితే కంపెనీల సామర్థ్యాన్ని పరిశీలించిన తరువాతే ఈ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనేదానిపై తుది నిర్ణయం తీసుకోనుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. గత మంగళవారం అర్ధరాత్రి డాక్‌యార్డులో నిలిపి ఉంచిన జలాంతర్గామిలో భారీ పేలుడు సంభవించి, దాదాపు 18 మంది సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే.
ఇందులో ఆరుగురి మృతదేహాలను వెలికితీయగా అవి గుర్తు పట్టనంతగా కాలిపోయాయి. దీంతో వీటిని గుర్తించేందుకు రక్తపు నమూనాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షల కోసం శాంతక్రజ్ ప్రాంతంలోని కలీనాలోగల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. సింధురక్షక్‌లో చిక్కుకున్న నేవీ సైనికులు, అధికారుల మృతదేహాలను వెలికితీసే పనులు యుద్ధప్రాతిపదిక ప్రయత్నాలు సాగుతున్నాయి. పేలుడులో చిక్కుకున్న వీరంతా ఇక బతికి ఉండే అవకాశాలు దాదాపుగా ఆవిరైనట్లేనని అధికారులు చెబుతున్నారు. పేలుడులో చిన్నాభిన్నమైన శవాలను వెలికి తీసేందుకు, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దాదాపు వారం రోజులుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఇక నీటి అడుగున ఉన్న జలాంతర్గామిని బయటకు తీయడంపై అధికారులు దృష్టిసారించారు. అయితే నీటి అడుగున ఉన్న దీనిని తీయడం అంత సులభమైన పనికాదు. అయితే ఎలా బయటకు తీయాలనే విషయమై అధ్యయనం జరుపుతున్నారు. సాల్వేజ్ సంస్థకు చెందిన రెండు కంపెనీలు జలాంతర్గామిని బయటకుతీసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులపై అధ్యయనం జరుపుతున్నాయి. అయితే తీయడం తమవల్ల అవుతుందా? లేదా? అనే విషయమై కూడా ఈ కంపెనీలు తుది నిర్ణయానికి రాలేదని సమాచారం.