న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాల కాలంలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగతా దేశమంతటా సాధారణ వర్షపాతం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వెల్లడించింది. దేశం మొత్తంగా చూసినప్పుడు గత కొన్నేళ్ల సరాసరి వర్షపాతంతో పోలిస్తే.. జూలై నెలలో 101 శాతం, ఆగస్టులో 94 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ‘ఈ ఏడాది మొత్తం నైరుతి రుతుపవన కాలం (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు)లో చూస్తే సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి.
ఈ వర్షాకాలంలో సగటున 97 శాతం (4శాతం ఎక్కువ లేదా తక్కువ కావచ్చు) వర్షం కురుస్తుంది’ అని ఐఎండీ తెలిపింది. వచ్చే 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనీ, జూన్ 3 నాటికి దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో, 6వ తేదీకి గోవా, మహారాష్ట్రల్లోనూ వర్షాలు మొదలవుతాయని వెల్లడించింది. ప్రాంతాలవారీగా చూసినప్పుడు సరాసరి వర్షపాతంతో పోలిస్తే వాయవ్య రాష్ట్రాల్లో వంద శాతం, మధ్య భారతంలో 99 శాతం, దక్షిణాది రాష్ట్రాల్లో 95 శాతం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో 93 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment