
జబల్పూర్ : విగ్రహాల ధ్వంసం ఘటనలకు బ్రేక్ పడటం లేదు. దేశవ్యాప్తంగా మహనీయుల విగ్రహాలను లక్ష్యంగా చేసుకుంటున్న దుండగులు తాజాగా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని అవమానించారు. శుక్రవారం ఉదయం కొందరు దుండగులు నేతాజీ విగ్రహానికి ఎరుపు రంగు పులిమారు. ఈ ఘటనపై స్ధానిక అధికారుల చొరవతో పోలీసులు ప్రాధమిక దర్యాప్తును చేపట్టారు.
గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. త్రిపురలో రెండు లెనిన్ విగ్రహాలను కొందరు కూల్చివేశారు. అగర్తలాలో కొందరు దుండగలు లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేయగా, బెలోనియాలో వ్యవసాయ క్షేత్రంలోని లెనిన్ విగ్రహాన్ని బుల్డోజర్‌తో తొలగించారు. లెనిన్ విగ్రహాన్ని నేలమట్టం చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.మరోవైపు యూపీలోని ఖరోవ్ గ్రామంలో శుక్రవారం హనుమాన్ విగ్రహంపైనా దుండగులు దాడికి తెగబడ్డారు. విగ్రహాల కూల్చివేతలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపడతామని ప్రధాని హెచ్చరించినా ఇలాంటి ఘటనలు కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.