ఒడిశా బాలికకు ఆరు లక్షల గూగుల్ అవార్డు
భువనేశ్వర్: ఐడియా రావాలిగానీ జీవితాలను మార్చివేసే ఆవిష్కరణలను చేయవచ్చని ఒడిశాలోని కోరాపుట్‌కు చెందిన 13 ఏళ్ల విద్యార్థిని లలిత ప్రసిద శ్రీపాద శ్రీసాయి నిరూపించారు. పర్యావరణ పరిరక్షణ పద్ధతిలో వాటర్ ప్యూరిఫైయర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించినందుకుగాను ఆమె మంగళవారం కాలిఫోర్నియాలో జరిగిన ‘గూగుల్ సైన్స్ ఫేర్’లో ఆరు లక్షల రూపాయల నగదు అవార్డును అందుకున్నారు. ఆ బాలిక కనుగొన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఓ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని ఈ సందర్భంగా గూగుల్ యాజమాన్యం ప్రకటించడం ముదావహం.
ఆమె కనుగొన్న ప్యూరిఫైయర్ ప్రక్రియ
శ్రీసాయికి ఓ రోజున హఠాత్తుగా ఓ ఐడియా తట్టింది. వెంటనే తన ఇంటికి సమీపంలోని పొలానికి వెళ్లింది. అక్కడ వృధాగా పడేసిన గింజలు వలిచేసిన మొక్కజొన్న కంకులను సేకరించింది. వాటిని తీసుకొచ్చి దాదాపు నెల రోజుల పాటు ఎండపెట్టింది. ఓ పొడవాటి మొక్కజొన్న కంకి మధ్య గుండా నీళ్లు పోవడానికి వీలుగా ఓ రంధ్రం చేసింది. దాన్ని జగ్గులాంటి ల్యాబ్ బాటిల్‌లో అమర్చింది.
ఆ బాటిల్ కింద మరో నాలుగు బాటిళ్లను ఏర్పాటు చేసి, వాటిలో చిన్నగా కత్తిరించిన మొక్కజొక్క కంకి ముక్కలను వేసింది. ఇంటి ముందున్న మురికి కాల్వ నుంచి మురికి నీటిని తీసుకొచ్చి పైనున్న జగ్గులాంటి బాటిళ్లో పోసింది. అది కంకి రంధ్రం గుండా ప్రవహించి మిగతా నాలుగు బాటిళ్ల ద్వారా ఫిల్టర్ అవుతూ కిందనున్న గిన్నలోకి నీళ్లు చేరాయి. ఆశ్చర్యం, పైన పోసిన మురికి నీరు కాస్త 80శాతం ఫిల్టరై అడుగునున్న గిన్నెలో పడ్డాయి.
మురికి నీటిలో ఉండే రకరకాల లవణాలు, ఆమ్లాలు, డిటర్జెంట్స్, రంగులు, చమురు మొక్కజొన్న కంకులు పీల్చుకోగా స్వచ్ఛమైన నీరు అడుగుకు చేరుకొంది. ఎలాంటి విద్యుత్, అంటే కరెంట్, బ్యాటరీలు అవసరం లేకుండా, కానీ ఖర్చు లేకుండా నీటిని ఇలా ప్యూరిఫై చేసుకోవచ్చని శ్రీసాయి నిరూపించింది. పైగా వృధాగా పడేసే కంకులను ఇలా ఉపయోగించడం పర్యావరణానికి అనుకూలం కూడా. 13 నుంచి 18 ఏళ్ల క్యాటగిరీలో శ్రీసాయికి ఈ అవార్డు లభించింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఎంట్రీలలో నూతన ఆవిష్కరణలకుగాను మరికొంత మందికి కూడా శ్రీసాయితోపాటు అవార్డులు అందజేశారు.