చెరిగిపోని మరకలు
- దురాగత ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య
- అవి సమాజంపై, దేశంపై మచ్చగా మిగిలిపోతాయి
- ఐక్యత, సామరస్యాలే మంత్రంగా ముందుకు సాగాలి
- భారతీయులందరూ దేశభక్తులే.. అందుకు రుజువులు అవసరంలేదు
- చట్టాల రూపకల్పనలో రాజ్యసభ అడ్డంకిగా మారకూడదు
- దేశహితం కోసం రాజకీయాలను పక్కనబెట్టాలి
- రాజ్యాంగంపై చర్చకు రాజ్యసభలో ప్రధాని సమాధానం
న్యూఢిల్లీ: దురాగత ఘటనలేవైనా.. అవి సమాజంపై, జాతి ప్రతిష్టపై మచ్చగా మిగిలిపోతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆ అపఖ్యాతి బాధను దేశమంతా భరించాల్సి ఉంటుందన్నారు. ‘ఎవరిపై జరిగిన ఎలాంటి దుశ్చర్యైనా.. అది మనందరిపై మచ్చగా మిగులుతుంది. సమాజంపై, దేశంపై మరకగా నిలిచిపోతుంది’ అని వ్యాఖ్యానించారు.
ఏ ఘటనను ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ.. సంచలనం సృష్టించిన దాద్రి, తదనంతర అసహన ఘటనలు, వాటిపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చనుద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. పారిస్‌లో జరుగుతున్న వాతావరణ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మంగళవారం భారత్ చేరుకున్నారు. అనంతరం, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యసభలో జరుగుతున్న చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఏకైక మార్గం ఐక్యత, సామరస్యతలేనని స్పష్టం చేశారు. 125 కోట్ల భారతీయుల్లో ఏ ఒక్కరి దేశభక్తిని కూడా ప్రశ్నించలేమన్నారు.
ఏ భారతీయుడు కూడా.. ఎవరికైనా సరే.. తాను కూడా దేశభక్తుడినేనంటూ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. దేశంలో నెలకొన్న అసహన వాతావరణంపై ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌పై కొందరు ‘పాకిస్తాన్‌కు వెళ్లిపో’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
‘ఐక్యత, సామరస్యత భారతదేశ సంప్రదాయం. భారత్ లాంటి వైవిధ్యతకు నెలవైన దేశంలో.. దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు మార్గాలను వెతకాలే కానీ.. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కారణాలు వెతకొద్దు. ప్రజలందరి ఐక్యత మన బాధ్యత’ అని హితవు పలికారు. ‘సమత, ప్రేమ అనే భావనల్లో ఎంతో శక్తి ఉంది. అయితే, మనలో ఉన్న శక్తే ఇతరుల్లోనూ ఉంటుందని గుర్తించాల’న్నారు. మోదీ ప్రసంగం అనంతరం.. భారతదేశ వైవిధ్యతను, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక లక్షణాలను కాపాడుతామంటూ రాజ్యసభ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాజ్యాంగంపై..
‘రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే విభిన్న వాదనలు వచ్చాయి. అయితే, దేశ అవసరాలను, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన దార్శనిక, చరిత్రాత్మక విధాన పత్రాన్ని రాజ్యాంగంగా మనకు అందించారు. ఇలాంటి దార్శనిక పత్రాన్ని మనకందించినందుకు రాజ్యాంగ రూపకర్తలకు సదా కృతజ్ఞులమై ఉండాలి’ అంటూ నివాళులర్పించారు. ‘రాజ్యాంగం అంటే కేవలం చట్టాలు కాదు. అదొక సామాజిక విధాన పత్రం. ఎప్పుడు ఏ సందేహం వచ్చినా, వివరణ అవసరమైనా మనమంతా చూసేది రాజ్యాంగం వైపే’ అన్నారు.
భారతీయులనందరినీ ఐక్యంగా ఉంచే శక్తి రాజ్యాంగానికి ఉందన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పోషించిన ఆదర్శప్రాయమైన మార్గదర్శక పాత్రను విస్మరించలేమన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ‘ఎథిక్స్ కమిటీ’ గురించి ఆలోచించలేదని, కానీ ఆ తరువాత దాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ‘1787లో ఫిలడెల్ఫియాలో రూపుదిద్దుకున తరువాత.. బహుశా ప్రపంచంలో చోటు చేసుకున్న అతిగొప్ప రాజకీయ కార్యక్రమం భారత రాజ్యాంగ రూపకల్పనే’ అన్న అమెరికాకు చెందిన ప్రఖ్యాత రచయిత గ్రేన్‌విల్ ఆస్టిన్ చేసిన వ్యాఖ్యను మోదీ గుర్తు చేశారు.
‘రేపటి నుంచి మనం చేసే పనులకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తప్పుబట్టలేం’ అంటూ 1947 ఆగస్ట్ 14న తొలి ఉప రాష్ట్రపతి ఎస్ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించారు. ఉన్నతస్థాయిలో అవినీతి, ఆశ్రీత పక్షపాతం ఉంటే పరిపాలన సమర్థంగా సాగదని కూడా రాధాకృష్ణన్ చెప్పారన్నారు. దేశంలో దళితులకు భూమి లేనందువల్ల.. వారికి ఉపాధి కల్పించేందుకు దేశంలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించాలని అంబేద్కర్ సూచించారని గుర్తుచేశారు.
రాజ్య సభపై..
‘రాజ్యసభకే నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. ఇది పెద్దల సభ. ఎక్కడైనా పెద్దవారు లేకుండా ఎలాంటి చర్చ జరగదు’ అని మోదీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ, రాజ్యసభల మధ్య సహకారం అవసరమన్నారు. చట్టసభలకు ఎన్నికైన తరువాత రాజకీయాలకు అతీతంగా ఎదగడంపై దృష్టి పెట్టాలన్నారు.‘రాజ్యసభకు మించిన మార్గదర్శి లేదు. అయితే, చట్టాల రూపకల్పనలో రాజ్యసభ అడ్డంకిగా నిలవరాదు’ అన్న రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడు గోపాలకృష్ణ అయ్యంగార్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. లోక్‌సభ, రాజ్యసభల మధ్య వివాదం తలెత్తినప్పుడు లోక్‌సభ వాదనకే విలువుంటుందని పేర్కొన్నారు.
రెండు సభలు సామరస్యంగా సాగాలని ప్రథమ ప్రధాని నెహ్రూ కూడా ఆకాంక్షించారన్నారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పలు బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొంది, ప్రభుత్వ పక్షానికి మెజారిటీ లేని కారణంగా రాజ్యసభలో పెండింగ్‌లో ఉండిపోయిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.
విపక్షంతో రాజీ ధోరణి
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పలు కీలక బిల్లుల ఆమోదం తప్పని సరైన నేపథ్యంలో.. ప్రధాని ప్రసంగంలో ప్రతిపక్షాలతో సయోధ్యాపూరిత తీరు కనిపించింది. జాతి హితానికి సంబంధించిన అంశాల్లోకి రాజకీయాలను తీసుకురావద్దని, పక్షపాత రహితంగా, ఏకాభిప్రాయం దిశగా సాగాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. నువ్వు.. నేను అనే వాదనలతో అభివృద్ధి జరగదన్న మోదీ.. అన్నింటినీ రాజకీయం చేసే తీరును విడనాడాలన్నారు.
ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్
‘ఇప్పటికే చాలా గొడవలు జరిగాయి. ప్రాంతాల మధ్య కూడా. అందుకే దేశ ఐక్యతను బలోపేతం చేసేందుకు ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్’ పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించబోతున్నాం. రాష్ట్రాల మధ్య సామరస్యాన్ని పెంచే దిశగా ఇతర రాష్ట్రాల భాషలను నేర్చుకోవడం, వారి పండుగలను జరుపుకోవడం లాంటి కార్యక్రమాలను చేపడతాం’ అని మోదీ వెల్లడించారు.
ప్రధాని ప్రసంగంలో కోట్స్
- నేను, మీరు అనే శబ్దాలను ప్రయోగించటం నా పద్ధతి కాదు. నేను ‘మనము’ అనే పదాన్నే వాడతాను
‘కరత్ కరత్ అభ్యాస్ కే, జడ్‌మతీ హోత్ సుజాన్
రస్‌రీ ఆవత్ జాత్ తే, శిల్ పర్ పరత్ నిశాన్’
- బావిలో నీళ్లను చేదే తాడుకు.. రాయితో పోరాడేంత శక్తి ఉండదు. కానీ నిరంతర సాధన వల్ల ఆ రాయిపైన కొత్త రూపం కల్పించగలుగుతుంది.
‘న సా సభా యత్ర న సంతి వృద్ధా:, వృద్ధ: నతేయో న వదంతి ధర్మం
ధర్మ: స నో యత్ర న సత్యమస్తి, సత్యం న తథాచ్ఛలంభ్యుపైతి’
- ఏ సభలో అయితే చర్చ జరగదో.. అనుభవజ్ఞులైన, ధర్మజ్ఞులైన పెద్దలు ఉండరో.. ఆచరిస్తున్న ధర్మంలో సత్యం ఉండదో.. అది అర్థరహితమైనసభ. అందుకే రాజ్యసభకు ఓ విశిష్ఠత ఉంది.
‘యద్య దాశరథి శ్రేష్ఠస్తత్ దేవేతరో జన:
స యత్ ప్రమాణం కురుతే లోకస్త దనువర్తతే
గొప్పవాళ్లు పాటించే వాటిని.. మిగిలిన వాళ్లు ఆచరిస్తారు. వాళ్లు ఏదైతే చేయాలని నిర్ణయిస్తారో.. దాన్ని మిగిలిన వారంతా అనుసరిస్తారు.
‘ప్రపంచంలో గొప్ప దేశమేదని నన్నెవరైనా అడిగితే.. ప్రకృతిలోనే ధనం, శక్తి, సౌందర్యం ఎక్కడైతే ఉంటుందో.. అలాంటి భూతల స్వర్గమైన భారత్ గురించే చెబుతాను. భారతీయులు ప్రపంచంలోని చాలా సమస్యలు పరిష్కారాన్ని ఎప్పుడో సూచించారు. ప్లూటో గురించి వాళ్లు ఎప్పుడో తెలుసుకున్నారు’ - మాక్స్ ముల్లర్