23న ‘ఆయుష్మాన్‌ భారత్‌’ | PM to launch Ayushman Bharat scheme from Jharkhand on September 23 | Sakshi
Sakshi News home page

23న ‘ఆయుష్మాన్‌ భారత్‌’

Published Sat, Sep 8 2018 4:43 AM | Last Updated on Sat, Sep 8 2018 4:43 AM

PM to launch Ayushman Bharat scheme from Jharkhand on September 23 - Sakshi

రాంచీ/న్యూఢిల్లీ: ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రకటించిన ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమాన్ని ఈ నెల 23న ప్రధాని మోదీ జార్ఖండ్‌ నుంచి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జార్ఖండ్‌ ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాన్ని జార్ఖండ్‌ నుంచి ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించడం మాకు గర్వకారణం’ అని జార్ఖండ్‌ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలోని 3.25 కోట్ల మంది ప్రజలతో సహా భారతీయులంతా ఈ చారిత్రక సందర్భం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చైనా పర్యటనలో ఉన్న జార్ఖండ్‌ సీఎం రఘువర్‌ దాస్‌ ట్వీట్‌ చేశారు. సెప్టెంబర్‌ 23న ఈ కార్యక్రమం సందర్భంగా.. కోడర్మాలో మెడికల్‌ కాలేజీకి, చాయ్‌బాసాలో కేన్సర్‌ ఆసుపత్రికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. బిర్సాముండా జైలు పునరుద్ధరణ పనులనూ మోదీ ప్రారంభిస్తారు.  

ఆయుష్మాన్‌ భారత్‌ భేష్‌!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కార్యక్రమంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. 50 కోట్ల మంది పేదలకు (10కోట్ల కుటుంబాలకు) ఏడాదికి రూ.5లక్షల ఆరోగ్య బీమా అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చొరవ భేష్‌ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అభినందించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమని.. ప్రధాని  చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘సార్వత్రిక ఆరోగ్య బీమా కార్యక్రమమైన ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప మార్పుకు సంకేతం. ప్రధానికి కృతజ్ఞతలు.  ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు కృతజ్ఞతలు’ అని టెడ్రోస్‌ గురువారం ీæ్వట్‌ చేశారు. డబ్ల్యూహెచ్‌వో డీజీకి కేంద్ర మంత్రి నడ్డా ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ అందరికీ అందాలనేదే మోదీ లక్ష్యమన్నారు. ‘డాక్టర్‌ టెడ్రోస్‌ మీతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. అందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలని మోదీ సంకల్పించారు. 50 కోట్ల మందికి (అమెరికా, కేనడా, మెక్సికో దేశాల జనాభా కలిపితే) ఒక్కొక్కరికి రూ. 5లక్షల ఆరోగ్య బీమా అందుబాటులో ఉంటుంది’ అని నడ్డా ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement