ఎవరినీ ఉపేక్షించం | PM Modi condemns Akash Vijayvargiya bat attack | Sakshi
Sakshi News home page

ఎవరినీ ఉపేక్షించం

Published Wed, Jul 3 2019 4:08 AM | Last Updated on Wed, Jul 3 2019 8:29 AM

PM Modi condemns Akash Vijayvargiya bat attack - Sakshi

మోదీని సన్మానిస్తున్న అమిత్‌ షా, నడ్డా

న్యూఢిల్లీ: బీజేపీ నేతలెవరైనా సరే అహంకారపూరితంగా, అనుచితంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ సీనియర్‌ నేత కైలాశ్‌ విజయ్‌వర్గీయ కొడుకు, ఎమ్మెల్యే ఆకాశ్‌ వర్గీయ ఇటీవల ఓ ప్రభుత్వ అధికారిపై క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేసిన ఘటన నేపథ్యంలో ప్రధాని ఈ హెచ్చరికలు చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘అతడు ఎవరి కొడుకైనా సరే అటువంటి వారి అహంకారపూరిత, దుష్ప్రవర్తనను సహించేది లేదు.

ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే ఊరుకోబోం. కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఆకాశ్‌ జైలు నుంచి విడుదలైనపుడు హడావుడి చేసిన నేతలపై బీజేపీ గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమయంలో ఆకాశ్‌ తండ్రి కైలాశ్‌ సమావేశంలోనే ఉండటం గమనార్హం. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో లోక్‌సభలో పార్టీ సభ్యుల హాజరు శాతం తక్కువగా ఉండటంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ప్రజలకు గుర్తుండేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

బీజేపీ సిద్ధాంతకర్త శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా ఈ నెల 6వ తేదీన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారణాసి నుంచి ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రతి బూత్‌ పరిధిలో కనీసం ఐదు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ‘పంచవటి’గా పేర్కొన్నారు. శ్రీ సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో 14 ఏళ్లపాటు పర్ణశాలలో నివసించిన విషయం తెలిసిందే.

ఎంపీలతో ప్రధాని వరుస సమావేశాలు
బీజేపీ ఎంపీలతో మోదీ తన నివాసంలో ఈ వారం వరుస సమావేశాలు జరపనున్నారు. ఎంపీలను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, యువత తదితర గ్రూపులుగా విభజించి వేర్వేరుగా మాట్లాడతారు. పార్లమెంట్‌తో వివిధ అంశాలపై ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడమే ఈ భేటీల ఉద్దేశం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement