సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ ఆరోసారి విజయం సాధించింది. ఈ విజయం బీజేపీలో కొత్త జవసత్వాలు కల్పించిందనేది వాస్తవం. గుజరాత్‌లో బీజేపీ విజయానికి పరోక్షంగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, శరద్ పవార్ నాయత్వంలోని ఎన్సీపీలు కారణమయ్యాయి. ఈ రెండు పార్టీలు గుజరాత్ బరిలో దిగకుండా ఉంటే.. బీజేపీ తప్పకుండా ఓటమి పాలయ్యేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన పది సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు 200 నుంచి 2000 ఓట్ల మెజారిటీతోనే గెలుపొందారు. ఈ స్థానాల్లో బీఎస్పీ, ఎన్సీపీలు 1200 నుంచి 35 వేల ఓట్లను సాధించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ గుజరాత్ పీఠాన్ని కైవసం చేసుకునేదని విమర్శకుల అభిప్రాయం.
చీలిన వ్యతిరేక ఓట్లు
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రధాన కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడమే. ఈ ఓట్లలో చీలిక రాకపోతే.. కాంగ్రెస్ 99, బీజేపీ 80 సీట్లుగా గణాంకాలు ఉండేవి. కీలకమైన పది స్థానాల్లో అది కూడా వందల ఓట్లలో బీజేపీ అభ్యర్థులు గెలిచిన స్థానాల్లో బీఎస్పీ, ఎన్సీపీలు భారీగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను సాధించాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
కలిసొచ్చిన స్వతంత్రులు
ఈ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రులు కూడా మేలు చేశారు. టిక్కెట్ దక్కని వారంతా.. స్వతంత్రులుగా బరిలోకి దిగారు. ఇండిపెండెంట్లు విజయం సాధించకపోయినా.. కాంగ్రెస్ అభ్యర్థులను మాత్రం ఓడించగలిగారు. స్వతంత్రుల వల్ల బీజేపీ 17 స్థానాల్లో లాభం పొందింది. ఇందుకు గోధ్రా సెగ్మెంట్ నిదర్శనం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 258 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ స్థానం నుంచి ఐదుగురు ముస్లింలు బరిలో నిలవగా.. ఇతర పార్టీలు అభ్యర్థులను నిలబెట్టాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి బీజేపీ విజయానికి బాటలు పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment