వారికి అసూయ, ఆత్మన్యూనత | PM Narendra Modi Attacks Rahul Gandhi, Reaches Out To Opposition | Sakshi
Sakshi News home page

వారికి అసూయ, ఆత్మన్యూనత

Published Fri, Mar 4 2016 3:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

వారికి అసూయ, ఆత్మన్యూనత - Sakshi

వారికి అసూయ, ఆత్మన్యూనత

* అందుకే సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు  
* కాంగ్రెస్ అగ్రనేతలపై లోక్‌సభలో ప్రధాని ధ్వజం
న్యూఢిల్లీ:
ఒకవైపు సుపరిపాలన కోసం మీ సహకారం అవసరమంటూనే.. మరోవైపు విమర్శనాస్త్రాలు, వ్యంగ్య వ్యాఖ్యలతో ప్రధాని మోదీ విపక్షంపై విరుచుకుపడ్డారు. తనపై ప్రతిపక్షం ముఖ్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చేసిన దాడిని తిప్పికొట్టారు. పార్లమెంటును పదేపదే అడ్డుకోవడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ దిగ్గజాలు నెహ్రూ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఇందిరా, రాజీవ్‌లు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రధాన కారణం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అగ్రనేతల్లో నెలకొన్న అసూయ, ఆత్మ న్యూనతా భావమేనని వ్యాఖ్యానించారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు గురువారం ప్రధాని మోదీ లోక్‌సభలో సమాధానమిచ్చారు. అయితే, రాహుల్, ఇతర విపక్ష నేతలు తమ ప్రసంగాల్లో లేవనెత్తిన బ్లాక్ మనీ, జేఎన్‌యూ, రోహిత్ వేముల ఆత్మహత్య.. తదితర అంశాలను మోదీ కనీసం ప్రస్తావించలేదు. ఇతరులను సంప్రదించే అలవాటును ప్రధాని అలవర్చుకోవాలంటూ రాహుల్ చేసిన సూచనకు  మోదీ వ్యంగ్యంగా స్పందించారు. రాహుల్ పేరును ప్రస్తావించకుండానే ‘కొందరికి వయసు పెరుగుతుంది కానీ అర్థం చేసుకునే శక్తి పెరగదు. అందువల్ల వారు ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది’ అన్నారు.

మన్మోహన్ ప్రధానిగా, ఆంటోనీ, శరద్ పవార్, ఫారూఖ్ అబ్దుల్లా లాంటి దిగ్గజాలు మంత్రులుగా ఉన్న కేబినెట్ జారీ చేసిన ఒక ఆర్డినెన్స్‌ను అదే రోజు మీడియా సమావేశంలో రాహుల్ చింపి విసిరేసిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. కీలక బిల్లులను విపక్షం రాజ్యసభలో అడ్డుకోవడంపై స్పందిస్తూ.. ‘భారతదేశాన్ని పేద దేశంగా, ఎప్పుడూ సాయం కోసం ఎదురు చూసే బీదదేశంగా చూపేందుకు కొందరు నిత్యం ఎందుకు ప్రయత్నిస్తుంటారో అర్థం కాద’ంటూ 1974లో ఇందిర చేసిన వ్యాఖ్యను గుర్తుచేశారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
 
మీ(విపక్షం) సహకారం లేకుండా మేము మెరుగైన పాలన అందించలేం. మీకు చాలా అనుభవం ఉంది. మీ అనుభవంతో లభించే ప్రయోజనాలు మాకు అవసరం. దేశాభివృద్ధి కోసం కలసి నడుద్దాం.
ప్రచారం కోసం రాజకీయ పార్టీలు అనుసరించే ‘మీదే తప్పంటే.. మీదే తప్పనే’ వైఖరి వల్ల అధికార గణం లాభపడ్తుంది. దేశం నష్టపోతుంది.
భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశానికి అధికార వర్గ దయాదాక్షిణ్యాలపై నడిచే పరిస్థితి రాకూడదు. శాసన వ్యవస్థ చాలా కీలకం. ఇక్కడి ప్రతి ఎంపీ ప్రధానితో సమానమైన గౌరవం, స్పందన పొందాలి.
ఇతరులకు చెప్పడం సులభం. కొందరుంటారు.. వారిని అంతా ప్రశ్నించేవారే. మరి కొందరిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండదు. నన్ను గత 14 ఏళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. నాకు అలవాటైపోయింది.
మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రతిష్టాత్మక పథకం విజయవంతం కాదేమోననిపిస్తే.. విజయవంతమయ్యేందుకు సలహాలు ఇవ్వండి కానీ తక్కువ చేసి మాట్లాడవద్దు.
రాహుల్‌పై పైచేయి సాధిస్తారేమోనన్న భయంతో ప్రతిభావంతులైన యువనేతలను కాంగ్రెస్ తొక్కేస్తోంది. పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు.
కీలక బిల్లులను రాజ్యసభలో నిలిపేస్తున్నారు. విజిల్‌బ్లోయర్స్ ప్రొటెక్షన్ బిల్లును ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు. జీఎస్టీ మీరు తీసుకువచ్చిన బిల్లే.
మీ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టి ఉంటే.. స్వచ్ఛ భారత్‌ను ప్రారంభించే అవసరం వచ్చేది కాదు.
విద్యుత్ సౌకర్యం లేక 18 వేల ఇళ్లు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. దేశానికి మీరిచ్చిన బహుమతి అది.
1972లోనే ఉపాధి హామీ తరహా పథకం ఒకటి మహారాష్ట్రలో అమల్లో ఉండేది.
పేదరికాన్ని అంతం చేస్తానని నేను ఇచ్చిన ఎన్నికల హామీని మీరు పదేపదే గుర్తు చేస్తున్నారు. నిజమే.. కానీ మీ పాలనలో పేదరికం చాలా లోతుకు చొచ్చుకుపోయింది. దాన్ని పెకిలించడం ఇప్పుడు మాకు చాలా కష్టంగా మారింది.
 
ఒక వారం కొత్త సభ్యులకు..
పార్లమెంటు నిర్వహణకు సంబంధించి మూడు కొత్త ప్రతిపాదనలను మోదీ సభ లో చెప్పారు. ‘ఉభయసభల్లో పూర్తిగా ఒక వారం రోజులు మొదటిసారి ఎన్నికైన సభ్యులను మాత్రమే మాట్లాడనివ్వాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న మహిళా సభ్యులే మాట్లాడాలి’ అని అన్నారు. ఐరాస సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి మోదీ మూడో ప్రతిపాదన చేశారు. ‘ఏదో ఒక శనివారం సభ్యులంతా రాత్రి వరకు కూర్చుని ఐరాస ప్రకటించిన సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఏమేం చేయాలో చర్చించాలి’ అన్నారు. మహిళా ఎంపీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడంపై లోక్‌సభ స్పీకర్‌ను ప్రధాని ప్రశంసించారు.
 
పార్లమెంటు సమాచారం
2013-15 మధ్య దేశంలో కరువు కారణంగా 4,200 మంది మృతిచెందగా.. 44వేల కోట్ల ఆస్తినష్టం సంభవించిందని.. ప్రభుత్వం లోక్‌సభలో తెలిపింది. వరదల కారణంగా 1.98 లక్షల పశుసంపద నష్టపోయినట్లు తెలిపింది.
ముంబైతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పోర్టుల స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని.. అరికట్టేందకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి గడ్కారీ తెలిపారు.
రాజీవ్ హంతకుల శిక్ష తగ్గించాలంటూ తమిళనాడు సర్కారు కేంద్రానికి లేఖ రాయటంపై కాంగ్రెస్ మండిపడింది. సీఎం జయలలిత రాసిన లేఖను పరిశీలిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 33 సోలార్ పార్కుల ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి గోయల్ తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును (33 శాతం) తీసుకొచ్చేందుకు కాలపరిమితేమీ లేదని కేంద్రం వెల్లడించింది.
ఉమ్మడి పౌరస్మృతిను అమల్లోకి తీసుకురావటంపై ఇప్పటికే సమాజంలోని వివిధ వర్గాల ప్రతిస్పందన అందిందని కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అధీనంలోని కోల్ ఇండియా సంస్థ శక్తి, శక్తేతర రంగాలకు తన దగ్గరున్న 14 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను విక్రయించేందుకు ప్రత్యేకంగా ఈ-వేలం నిర్వహించనుంది. కాగా.. 31 కోల్ బ్లాక్స్‌కు నిర్వహించిన వేలంలో కేంద్రానికి రూ.726 కోట్ల లాభం వచ్చినట్లు గోయల్ వెల్లడించారు.
 
రాజ్యసభలో....
స్మృతి ఇరానీపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం సభా హక్కుల తీర్మానాన్ని రాజ్యసభ ముందుకు తెచ్చారు. జేఎన్‌యూలో దుర్గామాతను దూషిస్తూ కరపత్రాలు వెల్లడైన అంశానికి సంబంధించి తనపై స్మృతి ఇరానీ నిరాధార, అవాస్తవ ఆరోపణలు చేశారని, దాంతో తనను తిడుతూ, బెదిరిస్తూ వేల సంఖ్యలో ఫోన్‌కాల్స్, లేఖలు వచ్చాయని రాజ్యసభ చైర్మన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
2010లో గుజరాత్‌లో 422 ఎకరాల స్థలాన్ని చదరపు అడుగుకు రూ.15 చొప్పున అమ్మేశారని, భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ ఆరోపించారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగా వకాశాలు తగ్గుతున్నాయని,  కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 6లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
వికలాంగుల కొత్త బిల్లులో చిన్నారుల్లోని డిస్లెక్సియా (రాయటం, చదవటంలో ఇబ్బంది పడేవారు), ఆటిజం (మాట్లాడటంలో ఇబ్బందిపడేవారు) లను చేర్చనున్నట్లు కేంద్రం తెలిపింది.
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎమ్ కింద 10 లక్షల మంది పట్టణ పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రి సుప్రియో వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement