సాక్షి, దుంగార్పూర్–ముంబై : ‘ముంబైలో ఉద్యోగం. ఆరువేల రూపాయల జీతం. ఉచిత వసతి. శుభ్రమైన మరుగుదొడ్లు. ఆసిక్తిగల నిరుద్యోగుల్లారా రండి! చదువు సంధ్యలతో పనిలేదు. కష్టపడి చేసే మనస్థత్వం. అందుకు పనికొచ్చే కాస్త కండ బలం ఉంటే చాలు’ అని మోటారు బైకులపై వచ్చిన వ్యక్తులు అరుస్తున్నారు. వారి అరుపులకు స్పందించిన యువకులు ఇంట్లోకి పరుగులు తీసి చేసంచీల్లో కట్టుకునే గుడ్డలు కుక్కుకుని మోటారు సైకిళ్ల వెనక సీట్లపై కూర్చున్నారు. రయ్...మంటూ ఆ మోటారు సైకిళ్లు 650 కిలోమీటర్ల దూరంలోని ముంబై నగరంవైపు దూసుకుపోయాయి. రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లా బీర్లి గ్రామంలో వర్షాకాలానికి కొన్ని రోజుల ముందు ఏటా కనిపించిన దృశ్యమిది.
మోటారు వాహనాలపై కాకుండా ఓ చిన్న ప్రైవేటు జీపులో వచ్చిన వ్యక్తుల పిలుపునకు స్పందించి పూర్జిలాల్ దామర్ బీర్లి నుంచి భివాండి వచ్చారు. ప్రస్తుతం 40 ఏళ్లున్న దామర్‌కు 1993లో ముంబై వచ్చినప్పుడు 15 ఏళ్లే. ముంబైలో ఉద్యోగం అంటే ముంబై , థాణె, ఘట్కోపర్, పరేల్ ఫుట్‌పాత్‌లపై ఉండే టీ కొట్టుల్లో పనని, ఉచిత వసతంటే తనతోపాటు నలుగురు కూలీలు వినియోగదారులకు వేసే బెంచీలపై పడుకోవడమని, శుభ్రమైన మరుగు దొడ్లంటే రైలు పట్టాల పక్కనుంచే బహిర్భూములని అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నారు. ‘రోజుకు 16 గంటలు టీ తాగిన గ్లాసులు కడుగుతూ ఇన్నేళ్లు బతికాను. నెలకు వంద రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. టీ యజమాని అయిన పాటిదార్ గ్లాసులు కడిగే ఉద్యోగం చేస్తున్నప్పుడు కనీసం పాలుకాసే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు’ అని పూర్జిలాల్ దామర్ వివరించారు.
పాతికేళ్ల అనంతరం టీ చేసే అవకాశం
25 ఏళ్ల అనంతరం ఇప్పుడు థాణెలో తనకు టీ తయారు చేసే అవకాశం దొరికిందని దామర్ తెలిపారు. రోజుకు 18 గంటలు, కొన్ని సార్లు 20 గంటలు పనిచేయాల్సి వస్తోందని, రోజుకు 35 లీటర్ల పాలతో టీ తయారుచేసి విక్రయిస్తానని, నెలకు 8,000 రూపాయలు సంపాదిస్తున్నానని ఆయన చెప్పారు. తాము ఎప్పుడూ నిలబడే పనిచేయాల్సి ఉంటుందని, ఎప్పుడోగానీ కూర్చునే అవకాశం రాదని చెప్పారు. తన టీ కొట్టు యజమాని కూడా తన ప్రాంతానికి చెందిన పాటిదార్ అని, ఆయనకు థాణెలో ఫుట్‌పాత్‌లపై నాలుగు టీ బండ్లు ఉన్నాయని తెలిపారు. తన తండ్రి, దగ్గరి బంధవులంతా బతుకుతెరువు కోసం ముంబై రావడం వల్ల, పెద్దగా చదువుకోని తాను కూడా ముంబైకే రావాల్సి వచ్చిందని చెప్పారు.
దక్షిణ రాజస్థాన్‌లోని వాగడ్ ప్రాంతం, గుజరాత్‌కు చెందిన పాటిదార్లు, బ్రాహ్మణులే ఎక్కువగా ముంబై వీధుల్లో టీ బండ్లు నిర్వహిస్తున్నారని, వారి వద్ద వాగడ్ ప్రాంతానికి చెందిన వారే దాదాపు 12000 మంది ఛాయ్ వాలాలుగా పనిచేస్తున్నారని ‘ఆజీవిక బ్యూరో’ అనే స్వచ్ఛంద సంస్థ తెలియజేసింది. వాగడ్ ప్రాంతంలో ప్రతి మూడో ఇంట ఇలా టీ కార్మికుల్లా ముంబైకి వలసవచ్చిన వారు ఒక్కరైనా ఉంటారు. వారు పట్టభద్రులే కాదు, పీజీలు చేసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో హిందీ సాహిత్యంలో ఎంఏ బీఈడీ చేసిన గోపాల్ మనాత్ ఒకరు. 2017, అక్టోబర్‌లో ఇక్కడికి వచ్చిన ఆయన రోజుకు 19 గంటలు పనిచేస్తే రోజుకు 200 వందల రూపాయలు వస్తున్నాయట. కప్పులు కస్టమర్లు పడగొట్టిన, టీ డబ్బులు కట్టకుండా ఎవరైనా ఎగ్గొట్టినా కార్మికుల జీతం లేదా కూలీ నుంచే కత్తిరించుకుంటారని ఆయన చెప్పారు. కనీసం ఆదివారం నాడు కూడా తమకు సెలవు ఉండదని, ముంబైకి వచ్చినప్పటి నుంచి కనీసం సినిమా కూడా చూడలేదని వాపోయారు.
70 ఏళ్ల క్రితమే ఈ వలసలు
వాగడ్ ప్రాంతం నుంచి టీ కార్మికులుగా వలసలు దాదాపు 70 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యాయని, ఇప్పటి వరకు మూడు, నాలుగు తరాలు ఇలా వలసపోయారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. తన పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల నుంచి దాదాపు 350 మంది కార్మికులు ఇప్పుడు ముంబైలో టీ కార్మికులుగా పనిస్తున్నారని, వాగడ్ ప్రాంతంలోని ఓద్ పంచాయితి సర్పంచ్ కాంతాదేవీ నానోమా తెలిపారు. టీ కార్మికులుగా ముంబైకి వలసపోయిన వారు ప్రస్తుతం 12వేల మందికన్నా ఎక్కువే ఉంటారని, ఒప్పందాలన్నీ నోటి మాటగానే ఉంటాయి కనుక వారెంత మందన్నది కచ్చితంగా చెప్పలేమని దుంగార్పూర్ పౌరసంబంధాలాధికారి ఛాయా ఛోబిసా తెలిపారు.
టీ యజమానులైన పాటిదారులు, బ్రాహ్మణులు టీ కొట్టుల నిర్వహణలో పాలి పద్ధతి పాటిస్తారట. అంటే రుతువులను బట్టి ఆయా ప్రాంతాల్లో జరిగే వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకొని వారు పరస్పరంగీకారంతో టీ కొట్ల ప్రాంతాలను మార్చుకుంటారట. కార్మికులను మాత్రం మార్చుకోరట. పైగా ఏ కార్మికుడికి ఎక్కువ జీతం ఇవ్వకుండా టీ యజమానుల మధ్య స్పష్టమైన అంగీకారం ఉంటుందని వారి దుర్భర జీవితాలపై కొంత అధ్యయనం చేసిన ‘ఆజీవిక’ సంస్థ తెలియజేసింది. ఎక్కువ పారిశ్రామక ప్రాంతాల్లో, రద్దీ మార్కెట్ల వద్ద ఉండే ఈ టీ బండ్లలో దాబర్, నానోమా, మవత్, మాల్, కలసు బడుగువర్గాలకు చెందిన బీసీలే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. యాభై ఏళ్లు దాటిన టీ కార్మికులు తమ ఊరికి వెళ్లిపోయి తమ స్థానాల్లో కొత్తవారిని ముంబైకి పంపిస్తున్నారట. అలా చేయడం వల్ల వారికి కొంత సొమ్ము ముడుతుందట. అంటే తెలిసీ, తెలిసీ వారు ఇతరులను తమలాగా రొంపిలోకి దింపుతున్నారన్నమాట. అలా పూర్జిలాల్ దామర్ కూడా తమ ఇద్దరు సోదర్లను ముంబైకి తీసుకొచ్చారు.
ఆరు అణాల టీ ఆరు రూపాయలు
ఇక టీ యజమానులైతే అరవై ఏళ్ల పైబడి కూడా వ్యాపారం చేస్తున్నారు. తనకు ముంబైలో నాలుగు టీ బంకులు ఉన్నాయని, వాటిల్లో 20 మంది కార్మికులు పనిచేస్తున్నారని 60 ఏళ్ల యజమాని భగవాన్ మంజీ పాటిదార్ తెలిపారు. తాను 1978లో ఆరు అణాలకు టీ అమ్మానని, ఇప్పుడు ఆరు రూపాయలకు ఒక టీ అమ్ముతున్నానని తెలిపారు. జౌళి మిల్లు కార్మికులే తన కస్టమర్లని, సెంచరీ మిల్స్ వెలుపల తనకు ఓ టీ బంకుందని ఆయన చెప్పారు. వర్షాకాలంలో తమకు వ్యాపారం ఎక్కువ ఉంటుందని, వర్షాకాలానికి ముందే కార్మికులను నియమించుకుంటామని చెప్పారు. టీ వ్యాపారం ద్వారా తమకు ఎంత ఆదాయం వస్తుందన్న విషయాన్ని మాత్రం వారు వెల్లడించడానికి నిరాకరించారు. 20 ఏళ్లు టీ చేసి అమ్మితే ఇంతకాలానికి సొంతంగా టీ బంకు నడిపే అవకాశం దొరికిందని, కొన్ని వేల మందిలో కొందరికే ఇలాంటి అవకాశం దొరుకుతుందని భివాండీ నుంచి ఇటీవలనే ఇంటికి వచ్చిన దీపక్ దామర్ తెలిపారు. ఎన్నో ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను చూడడం కోసం వచ్చానని, వ్యాపారాన్ని కార్మికులకు అప్పగించి వచ్చానని, మళ్లీ వెళతానని ఆయన చెప్పారు.
ఓ ఛాయ్‌వాలా ప్రధాన మంత్రి అయిన భారత దేశంలో ఛాయ్‌వాలాల పరిస్థితి ఇంత దారుణంగా ఉందన్న విషయాన్ని ఆయన దృష్టికి ఎవరన్న తీసుకెళితే బాగుంటుందేమో!
‘ముంబైలో ఉద్యోగం. ఆరువేల రూపాయల జీతం. ఉచిత వసతి. శుభ్రమైన మరుగుదొడ్లు’ అన్న పిలుపును అన్నేళ్లు గుజరాత్‌లో ఉన్న నరేంద్ర మోదీ వినే ఉంటారేమో!
Comments
Please login to add a commentAdd a comment