'వాద్రాకిస్తున్న ప్రాముఖ్యతపై ఈర్ష్యగా ఉంది'
న్యూఢిల్లీ: కాగ్ నివేదికపై ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై రాబర్ట్ వాద్రా ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. మైక్రోఫోన్‌ను పక్కకు నెట్టేసిన ఘటనపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జర్నలిస్టులు సంయమనం పాటించాలని, ఎలాంటి అధికారిక పదవిలో లేని ఒక ప్రై వేటు వ్యక్తిని.. రాజ్యాంగబద్ధ సంస్థలు కొట్టేసిన అంశంపై పదేపదే ప్రశ్నించడం తగదని కాంగ్రెస్ సూచించింది. చిన్న విషయాన్ని ఇంతగా రాద్ధాంతం చేయడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత రషీద్ అల్వీ అన్నారు. ‘ఒక ప్రై వేటు వ్యక్తి(వాద్రా)ని ఎందుకంతగా వెంటాడుతున్నారు? ఆయన చట్టాన్ని అతిక్రమిస్తే కేసు పెట్టండి. అక్రమంగా సంపాదిస్తే.. ఆ డబ్బును స్వాధీనం చేసుకోండి. అంతేకానీ, ఆయనపై మీడియా ఇంతగా దృష్టి పెట్టడం సరికాదు.
మీడియా వాద్రాకిస్తున్న ప్రాముఖ్యత చూస్తుంటే రాజకీయ నేతలమైన మాకు ఈర్ష్యగా ఉంది. రాజకీయ నేతలుగా మమ్మల్ని మీరు(జర్నలిస్టులు) లక్ష్యంగా చేసుకోండి. ఆయనను వదిలేయండి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.