అమెరికా మల్టీ నేషనల్ కంపెనీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చిన్న పరిశ్రమలపై చిన్న చూపు చూపిస్తున్నారని, ఆర్బీఐ గవర్నర్ పై సుబ్రమణ్య స్వామి విరుచుకుకు పడ్డారు.
న్యూఢిల్లీః సుబ్రమణ్యస్వామి ఆరోపణల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజన్ విధానాలతో చిన్న పరిశ్రమలకు పాతర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా మల్టీ నేషనల్ కంపెనీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చిన్న పరిశ్రమలపై చిన్న చూపు చూపిస్తున్నారని, వ్యవసాయ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని స్వామి విరుచుకుకు పడ్డారు.
రాజన్ తప్పుడు విధానాల ఆధారంగానే తాను విమర్శలు చేయాల్సి వస్తోందని, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పొట్ట కొట్టి, బహుళజాతి సంస్థలకు మేలు చేసేందుకు ఆయన ఈ విధానాలను అనుసరిస్తున్నారంటూ స్వామి ఆరోపించారు. ఆర్ బీ ఐ గవర్నర్ రాజన్ వ్యవసాయ వ్యతిరేక బ్యాంకింగ్ విధానాలను అనుసరించారని వాటిని తాను చార్జిషీటులో పొందిపరచినట్లు స్వామి తెలిపారు. ఢిల్లీలో జరిగిన భారతీయ కిసాన్ అభియాన్ లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంలో మాట్లాడిన స్వామి... అధిక వడ్డీరేట్లు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తీవ్ర నష్టాల్లో ముంచేస్తున్నాయని, దీంతో దేశవాళీ ఉత్పత్తులు తగ్గిపోవడమే కాక, నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. రఘురామ రాజన్ ను ఆర్బీఐ గవర్నర్ పదవినుంచీ వెంటనే తొలగించాలని కోరుతూ స్వామి ప్రధానమంత్రికి ప్రత్యేకంగా లేఖ రాశారు.