పేదలను పార్టీలోకి తీసుకురండి
న్యూఢిల్లీ: సమాజంలోని పేదలు, అణగారిన వర్గాల వారిని పార్టీలోకి తీసుకురావటంపై దృష్టి కేంద్రీకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీజేపీ రాజ్యసభ సభ్యులకు పిలుపునిచ్చారు. ‘‘మీరు ఏ రాష్ట్రాల నుంచి వచ్చారో.. ఆ రాష్ట్రాల అంశాలను మీరు లేవనెత్తాలి. సమాజంలోని అన్ని వర్గాల వారినీ.. ప్రత్యేకించి పేదలు, అణగారిన వర్గాలను పార్టీతో కలుపుకోవటంలో మీరు సమర్థవంతమైన పాత్ర పోషించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లటం లక్ష్యంగా జరిగిన బీజేపీ కీలక అంతర్గత సమావేశాల్లో చివరిగా బుధవారం ఢిల్లీలో పార్టీ రాజ్యసభ సభ్యుల సమావేశంలో మోదీ ముగింపు ప్రసంగం చేశారు.
ఎంపీలకు విశిష్ట గుర్తింపుతో కూడిన వేదికను పార్టీ అందించిందంటూ.. కొత్త రంగాల నుంచి ప్రజలను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు వారు కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ మీడియాకు తెలిపారు. పార్టీకి చెందిన 52 మంది రాజ్యసభ సభ్యులంతా హాజరైన ఈ సమావేశంలో అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, రాజ్యసభ నాయకుడు, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు కూడా ప్రసంగించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన ఒక్కో లోక్‌సభ స్థానాన్ని పార్టీకి చెందిన ఒక్కో రాజ్యసభ సభ్యులు దత్తత తీసుకోవాలని.. వచ్చే ఎన్నికల్లో ఆయా స్థానాల నుంచి పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని అమిత్‌షా సూచించారు.