ఆరెస్సెస్ కార్యాలయంపై హిందూ శ్రేణుల దాడి!
ధార్: మధ్యప్రదేశ్ ధార్‌లోని త్రిమూర్తినగర్‌లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యాలయంపై హిందూ కార్యకర్తలు శుక్రవారం దాడి చేశారు. కార్యాలయంపై రాళ్లు రువ్వి.. కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. బసంత పంచమీ సందర్భంగా ఇక్కడి భోజ్‌శాల కమల్ మౌలా మసీదు విషయమై వివాదం తలెత్తింది. ఈ ప్రాంగణంలో ఏకకాలంలో పూజలు చేసేందుకు హిందువులు, ప్రార్థనలు చేసేందుకు ముస్లింలు రావడంతో శుక్రవారం ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో భోజ్‌శాలలోకి ప్రవేశించవద్దని ఆరెస్సెస్ నాయకత్వంతోపాటు, ధర్మ జాగరణ్ మంచ్, భోజ్ ఉత్సవ సమితి హిందువులకు పిలుపునిచ్చింది. దీనిపై హిందూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఆరెస్సెస్ నాయకులు భోజ్‌శాలను అమ్మేశారంటూ మండిపడ్డారు. స్థానిక ఆరెస్సెస్ నాయకుడు విజయ్‌సింగ్ రాథోడ్ ఇంటి వద్ద భారీగా మూగి ఆందోళన చేసేందుకు వారు ప్రయత్నించారు.
తన రాజకీయ భవిష్యత్తు కోసం విజయ్‌సింగ్ రాథోడ్ బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కయి.. ఈ వ్యవహారంలో ఉద్యమాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ వారు నిరసన తెలియజేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భోజ్‌శాలలోకి ప్రవేశించేందుకు హిందువులకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక ఆరెస్సెస్ నాయకత్వం తీరుపై మండిపడుతూ హిందూ కార్యకర్తలు ఆ సంస్థ కార్యాలయంపై దాడి దిగారు.