
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా ముడుపుల కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. కార్తీ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కార్తీపై నమోదైన మనీలాండరింగ్ కేసుపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ముందస్తు అరెస్ట్‌లను నివారించేందుకు ఎలాంటి రక్షణ ఇవ్వబోమన్న సర్వోన్నత న్యాయస్ధానం కేసు విచారణను మార్చి 9కి వాయిదా వేసింది. తనకు ఈడీ జారీ చేసిన సమన్లను కొట్టివేయాలంటూ కార్తీ చిదంబరం సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అవినీతి కేసును విచారిస్తున్న సీబీఐ బైకుల్లా సెంట్రల్ జైల్లో కార్తీని ప్రశ్నిస్తోంది. తన తండ్రి ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ లభించేలా చేసేందుకు కార్తీ చిదంబరానికి భారీగా ముడుపులు ముట్టాయని సీబీఐ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే సీబీఐ వాదన అవాస్తవమని..రాజకీయ కక్షతోనే తనను వేధిస్తున్నారని కార్తీ ఆరోపిస్తున్నారు.