సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పది రూపాయల ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీ మరింత పెరగొచ్చు. ట్రైన్ కోసం ఏసీ విశ్రాంతి గదిలో నిరీక్షణకూ రుసుము రెట్టింపు కావొచ్చు. ఫలహారం.. టాయిలెట్లతోపాటు మంచినీళ్లకు కూడా డబ్బులు చెల్లించాల్సి రావొచ్చు. ఇవేకాదు.. నామమాత్రపు రుసుములతో లభించే సేవలన్నీ ఇకపై ఖరీదు కావొచ్చు. ఎందుకంటే రైల్వేస్టేషన్ల ప్రైవేటీకరణలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్‌లో సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. దీంతో ప్రయాణికులకు ఉచితంగా అందజేయాల్సిన కనీస సదుపాయాలు కూడా రుసుముల జాబితాలో చేరనున్నాయి. రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల భద్రత, టికెట్ బుకింగ్ వంటి కొన్ని అంశాలు మినహా స్టేషన్ నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు పూర్తిగా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనున్నాయి.
ప్రైవేటు బాటలో రైల్వే..
రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరించేందుకు రైల్వే బోర్డు ఇటీవల సన్నాహాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా నాలుగు రైల్వేస్టేషన్లను మొదట ప్రైవేటీకరించి ఆ తర్వాత దశలవారీగా మిగతా వాటిని ప్రైవేట్ పరిధిలోకి తేనుంది. దక్షిణమధ్య రైల్వేలో తొలుత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ప్రైవేటీకరణ జాబితాలోచేర్చారు. రైల్వేస్టేషన్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఐఆర్‌డీసీ) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రైవేటీకరణకు ప్రణాళికలను సిద్ధం చేసింది. త్వరలో కాంట్రాక్ట్ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. సికింద్రాబాద్ స్టేషన్ నిర్వహణ మొత్తం 15 ఏళ్ల పాటు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు లీజుకు ఇవ్వనున్నారు. చార్జీలు, సేవా రుసుముల నిర్ణయం, నియంత్రణ వంటివి ప్రైవేట్ సంస్థలే చూసుకుంటాయి.
ఈ సేవలు ప్రైవేట్ చేతుల్లోకి..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం సుమారు 1.8 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 100 ప్యాసింజర్ రైళ్లు, 121 ఎంఎంటీఎస్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. దీంతో స్టేషన్‌లోని 10 ప్లాట్‌ఫామ్‌లపై నిత్యం రద్దీ ఉంటుంది. విశ్రాంతి గదులు, రిటైరింగ్ రూమ్‌లు, రెస్టారెంట్‌లు, క్యాంటీన్‌లు, టాయిలెట్లు వంటి సదుపాయాల్లో కొన్ని నామమాత్రపు చార్జీలకే లభిస్తున్నాయి. ఏసీ రిటైరింగ్ రూమ్‌లో విశ్రాంతి కోసం గంటకు రూ.25 చొప్పున వసూలు చేస్తుండగా.. మిగతా విశ్రాంతి గదులన్నీ పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. రక్షిత మంచినీటిని ఉచితంగా అందజేస్తోంది. స్టేషన్‌కు నాలుగు వైపులా ఉన్న పార్కింగ్ స్లాట్లలో ధరల నిర్ణయం, రెస్టారెంట్లలో ఆహార పదార్ధాల ధరలు వంటివి ప్రస్తుతం రైల్వే నియంత్రణలోనే ఉన్నాయి. రైళ్లను శుభ్రం చేయడం, ఆన్‌బోర్డు సర్వీసులు, స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచడం వంటి సేవల కోసం ఔట్‌సోర్సింగ్ కార్మికుల సేవలను వినియోగించుకుంటోంది. స్టేషన్ ప్రైవేటీకరణ ద్వారా ఈ సేవలన్నీ ఇక బడా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనున్నాయి. సుమారు ఏడెనిమిది రకాల ప్రయాణికుల సదుపాయాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. విధానపరంగా స్టేషన్ల నిర్వహణ అంశం ఐఆర్‌డీసీ పరిధిలోనే ఉన్నా.. సదుపాయాలను అందజేసేందుకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్న దృష్ట్యా చార్జీల నియంత్రణ నుంచి రైల్వే శాఖ పూర్తిగా తప్పుకోనుంది.
రైళ్ల నిర్వహణ మాత్రమే రైల్వే పరిధిలో..
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే రైళ్ల నిర్వహణ, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ సేవలు, పట్టాలకు మరమ్మతులు, ట్రాక్ నిర్వహణ, ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణ, టికెట్ బుకింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ కౌంటర్లు మాత్రం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటాయి.
అటకెక్కిన రీడెవలప్‌మెంట్..
అంతర్జాతీయ ప్రమాణాల మేరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేసేందుకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో 45 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు రెండేళ్ల క్రితమే ప్రణాళికలను రూపొందించారు. ఈ లీజు ఒప్పందంలో భాగంగా రైల్వేస్టేషన్ పూర్తిగా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తుంది. స్టేషన్ చుట్టూ ఉన్న రైల్వే స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్, సినిమా థియేటర్లు, హోటళ్లు నిర్మించుకుని ఆదాయం సంపాదించుకునేందుకు ప్రైవేట్ సంస్థలకు అవకాశం లభిస్తుంది. ఈ మేరకు టెండర్లను ఆహ్వానించినా.. ఏ సంస్థా ముందుకు రాలేదు. దీంతో రీడెవలప్‌మెంట్ స్థానంలో ఇప్పుడు ఉన్న సదుపాయాలను మెరుగుపర్చి ప్రయాణికులకు అందజేసేలా 15 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ నిర్వహణకు ఏటా రూ.12 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు అంచనా. ఈ ఖర్చు మిగలడంతో పాటు ప్రైవేట్ సంస్థల నుంచి అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment