
‘సిగ్గులేని వ్యక్తి నుంచి రాజీనామా కోరడమా?..’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ఒక సిగ్గు లేని వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి నుంచి రాజీనామా ఎలా ఆశించగలమని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు రుజువైతే తప్ప కేజ్రీవాల్ రాజీనామా చేయనందున ఈ విషయాన్ని వెంటనే సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ.2కోట్ల లంఛాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకోవడాన్ని తాను కళ్లారా చూశానని ఆప్ మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌పై ముప్పేట దాడి జరుగుతోంది. ఇందులో భాగంగానే ఓ మీడియా స్వామిని ఈ విషయంపై స్పందన కోరగా..‘సిగ్గులేని ఒక కేజ్రీవాల్‌లాంటి వ్యక్తి నుంచి ఎవరు మాత్రం రాజీనామా ఆశిస్తారు? ముందునుంచే నేను ఆయనను రాజీనామా చేయాలని అడుగుతున్నాను. నేను ఆయనను శ్రీ 420 అని పిలుస్తుంటాను. అన్నా హజారేతో ఉన్నప్పటి నుంచి కేజ్రీవాల్ గురించి నాకు తెలుసు. ఆయన కమ్యూనిజానికి అనుకూలంగా ఉంటారని ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని స్వామి చెప్పారు.