
మహారాష్ట్రలో రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సమావేశమయ్యారు.
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బుధవారం సమావేశమయ్యారు. మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తాము మహారాష్ట్ర రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించలేదని, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తాను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని పవార్ తెలిపారు. రైతు సమస్యలపైనే ప్రధానితో చర్చించానని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర రైతుల ఇబ్బందులపై ఈ సందర్భంగా శరద్ పవార్ ప్రధాని మోదీకి వినతి పత్రం సమర్పించారు. రైతులకు తక్షణం కేంద్ర సాయం ప్రకటించానలి, షరతులు లేకుండా వ్యవసాయ రుణాల మాఫీని చేపట్టాలని కోరారు. మరోవైపు మహారాష్ట్ర రైతులను ఆదుకునేందుకు కేంద్రం త్వరలోనే రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ భేటీలో హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.