పాపం కదా అని రక్షిస్తే.. దాడి చేసింది
ఘరియాబంద్: పుణ్యానికి పోతే పాపం ఎదురైందంటే ఇదేనేమో.. బావిలో పడిపోయిన చిరుతపులిని రక్షిస్తే.. అది కాస్తా ఆ అటవీ అధికారిపైనే దాడిచేసిన ఘటన ఛత్తీస్గఢ్ లోని ఘరియాబంద్లో చోటుచేసుకుంది. స్థానిక అటవీ శాఖ అధికారి నరేంద్ర పాండే అందించిన వివరాల ప్రకారం...
ఆదివారం రాత్రి గ్రామంలోకి చొరబడ్డ చిరుతపులి ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు దానిని రక్షించడానికి పూనుకున్నారు. గ్రామస్తుల సహకారంతో అటవీ అధికారి ధైర్య సాహసాలు ప్రదరించి (రేంజర్ ఆఫీసర్) ఎట్టకేలకు ఆ క్రూరమృగాన్ని కాపాడారు.
దీంతో గ్రామస్తులు సంతోషంతోనూ, భయంతోనూ ఒక్కసారిగా పెద్దగా అరుపులు, కేకలు వేయడం మొదలుపెట్టారు. దీంతో బెదిరిపోయిన ఆ చిరుతపులి అటవీ అధికారిపై దాడిచేసింది. అదృష్టవశాత్తూ ఆ అధికారి స్పల్పగాయాలతో బైటపడ్డాడని నరేంద్ర పాండే తెలిపారు. విధినిర్వహణలో భాగంగా సాహసంతో అటవీ జంతువును కాపాడిన అధికారి మాత్రం బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు.