ఉండవల్లి జ్ఞానం.. సోనియాకు వ్యతిరేకం
ఢిల్లీ: రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన జ్ఞానాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారని ఎంపీ పొ్న్నం ప్రభాకర్ విమర్శించారు. ఇందిరాగాంధీ గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పే ఉండవల్లి, టీడీపీ ఎంపీలు ఇందిరా మాస్క్ ను ధరించినపుడు ఎందుకు మాట్లాడ లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరగదంటూ ప్రకటించిన ఉండవల్లి వ్యాఖ్యలపై పొన్నం మండిపడ్డారు.ఆయన తనకున్న జ్ఞానాన్ని సోనియాకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారన్నారు. సీమాంధ్రలో ఉదృతంగా సాగుతోన్న సమైక్య ఉద్యమాన్ని గురించి ఉండవల్లి లోక్సభలో ప్రస్తావించినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆయనను అడ్డుకున్న సంగతి తెలిసిందే.
తన ప్రసంగంలో ముల్కీ నిబంధనల అంశాన్ని ప్రస్తావించడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉండవల్లి ప్రసంగానికి వారు అడ్డుతగిలారు. సీమాంధ్ర ఉద్యమం దేశంలోనే పెద్దదని ఉండవల్లి అన్నారు. రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని విడదీయటం చరిత్రలో ఇదే మొదటిసారి అని తెలిపారు. సభ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుండటంతో టి కాంగ్ ఎంపీలను కూర్చోవాలని స్పీకర్ మీరాకుమార్ కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కాగా, తెలంగాణ ఎంపీలు మాత్రం ఉండవల్లి వైఖరిపై మండిపడుతున్నారు. సీమాంధ్ర ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకునే.. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని టీ.ఎంపీలు విమర్శలు గుప్పిస్తున్నారు.