
'స్వతంత్రంగా పోటీచేసినా గెలుస్తాను'
ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినా గెలుస్తానని, తనకు ప్రజల నుంచి మద్దతు ఉందని బీజేపీ అసమ్మతి ఎంపీ, షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినా తాను గెలుస్తానని, ప్రజల నుంచి తనకు మద్దతు ఉందని బీజేపీ అసమ్మతి ఎంపీ, షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా పేర్కొన్నారు. ఇతర పార్టీల నేతలు తనతో వారి పార్టీ అంతర్గత విషయాలు కూడా పంచుకుంటారని చెప్పారు. గతకొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై బాహాటంగా వ్యాఖ్యలు చేస్తూ.. స్వేచ్ఛగా మాట్లాడుతున్న శత్రుఘ్న సిన్హాను గత బిహార్ ఎన్నికల్లో పార్టీ పక్కనబెట్టిన సంగతి తెలిసిందే.
అయితే, ప్రధానమంత్రి మంచి చేసినా, చేడు చేసినా దానిపై తన అభిప్రాయాన్ని మాత్రమే చెబుతున్నాని, తానేమీ అసమ్మతితో రగిలిపోవడం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్న మంచి వ్యక్తిని తాను కావడంతో ఇతర పార్టీల నుంచి కూడా తనకు చాలాకాలంగా సమాచారం అందుతోందని, ఇందులో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఆయన పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 2.46 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందిన శత్రుఘ్న తనకు ప్రజామద్దతు ఉందని, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.