డల్లాస్: ఎన్నికలను మేనేజ్ చేయడం వల్లగానీ, మీడియాను మేనేజ్ చేయడంతోగానీ రాజకీయ పార్టీలు విజయాలు సాధించలేవని ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. డల్లాస్‌లో తెలంగాణ ఎన్‌ఆర్ఐలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్న సందర్భంగా కోదండరామ్ పలు అంశాలను ప్రస్తావించారు. ‘సామాజిక ఉద్యమాలు, ఘర్షణలు, కదలికలు, అప్పటి పరిస్థితులు ఎన్నికలకు మూలమని విశ్వసిస్తున్నాను. రాజకీయమంటే మీడియాను మేనేజ్ చేయడం, డబ్బులు పంచడం, ఎన్నికలను మేనేజ్ చేయడం కాదు. తెలంగాణ ప్రాంతంలోని సామాజిక పరిస్థితులు, ఉద్యమం, ఇతరత్రా కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అదే కారణంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది.
కానీ ఇప్పడు అలాంటి పరిస్థితులు లేవు. ఎన్నికల్లో నెగ్గిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సైతం ప్రస్తుతం ఎన్నికల కోసం అభ‍్యర్థులను ఎలా కొనగలం, ఇతర పార్టీల నేతలను ఏ విధంగా మన పార్టీలోకి రప్పించాలని చూస్తున్నారు. ఎన్నికల్లో మన నిర్వహణ సామర్థ్యం ఎలా పెంచుకోగలమని ఆలోచిస్తున్నారు. తొలిదశ ఉద్యమకాలంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉద్యమపార్టీ టీపీఎస్ నుంచి సాధారణ అభ్యర్థులు బరిలోకి దిగి.. కాంగ్రెస్‌ను ఓడించారు. అయితే ఆ సమయంలో పేపర్ తప్పా ఇతర మీడియా లేకున్నా ఆనాటి పరిస్థితుల కారణంగా టీపీఎస్ గెలుపొందింది. అప్పుడు ఎవరూ ఎన్నికలను గానీ, మీడియాను గానీ మేనేజ్ చేయలేదు.
ఉద్యమం ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది. డీపీఆర్ చెప్పండి, చూపించాలని మల్లన్నసాగర్ ప్రాజెక్టు వివరాలు అడిగితే ఏ విషయాలు చెప్పడం లేదు.
సాధారణ రైతులకు జవాబు చెప్పడం లేదు, సిటీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ప్లాన్ వివరాలు అడిగితే అలాంటివేం లేవు సార్.. ఆ కనిపిస్తున్న చోటు నుంచి ఇక్కడివరకూ భూమి తీసుకోవాలని చెప్పారని అధికారులు చెప్పారని గుర్తుచేశారు.
మీకు గుర్తింపు ఉంది కానీ మీకు రాజకీయాలు రావు. అందుకే మీరు ఉంటే మాకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మీరు ముందుండండి మేం పనులు చూసుకుంటామని కొందరు అన్నారు. ఎన్నికలను ప్రధానం చేసి ఆలోచిస్తున్నారు. మోసం, దగా తెలియాలి, మాయమాటలు చెప్పడం రావాలి అంటున్నారు. మరికొందరు మాత్రం మీతో డబ్బులు లేవు, మీ వల్ల ఇలాంటివి సాధ్యం కావని చెప్పారు. ఈ ఇద్దరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాం. మేం ఉండాలంటారు.. కానీ పనులు మాత్రం మీరే చూసుకుంటాం అంటున్నారు. అలాంటప్పుడు మేం ఉండటం ఎందుకు అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌లోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏం చేస్తారని అడిగితే వాటికి సమాధానం కరువైందంటూ’ ప్రొఫెసర్ కోదండరాం తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment