ఉన్నత విద్యా! నీ ఉన్నతి ఎలా? | Higher education Standards not to spoil by politics in society | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యా! నీ ఉన్నతి ఎలా?

Published Sat, Jan 10 2015 12:53 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

ఉన్నత విద్యా! నీ ఉన్నతి ఎలా? - Sakshi

ఉన్నత విద్యా! నీ ఉన్నతి ఎలా?

విద్యా ప్రమాణాలు దిగజారి, డిగ్రీలు అసంబద్ధమై, పట్టాలు ఉపాధికి పనికి రానివై, పట్టా పొందిన విద్యార్థులకు ఉద్యోగార్హతల్లేక... ఉన్నత విద్యకే పెనుసవాలుగా మారుతున్నాయి. ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంస్కరణ దిశలో తక్షణ చర్యలు చేపట్టకుంటే ఉన్నత విద్య ఇప్పట్లో బాగుపడే లక్షణాలు కనిపించడం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కార్పొరేట్ శక్తులు పెట్టుబడిదారులై, విద్య ఫక్తు వ్యాపారమై, ఉపాధ్యాయుల్ని ఉద్యోగులుగా, విద్యార్థుల్ని వినియోగదారులుగా పరిగణిస్తున్నంత కాలం ఉన్నత విద్యకు మోక్షం లేదనే భావన బలపడుతోంది.
 
ఉన్నత విద్యను ఇప్పటికే పీడిస్తున్న అనేకానేక సమస్యలకు తోడు రాజకీయ దివాలాకోరుతనం మరింత దిగజారుస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్య, దాని ప్రమాణాలు అత్యంత వేగంగా పడిపోతున్నాయి. గడచిన ఒకటి, రెండు దశాబ్దాలుగా ముప్పిరిగొంటున్న సమస్యలకు తోడైన తాజా పరిణామాలతో ఉన్నత విద్య, ప్రధానంగా వైద్య, సాంకేతిక ఇతర వృత్తి విద్యారంగం నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఇంటర్ పరీక్షలు,  ఎమ్‌సెట్, ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ విషయమై రెండు కొత్త రాష్ట్రాల నడుమ సాగుతున్న జగడం మచ్చుకు ఓ ఉదాహరణ (టిప్ ఆఫ్ ఐస్‌బర్గ్) మాత్రమే!
 
 విద్యార్థుల్లో అయోమయాన్ని, తల్లిదండ్రుల్లో ఆందోళ నను రేపుతున్న ఈ వివాదం ఏ రకంగా చూసినా అవాంఛనీయం. కానీ, ఎవరు చెప్పినా వినే పరిస్థితి రెండు ప్రభుత్వాలకూ లేదు. ప్రభుత్వ పెద్దలు పనికిమాలిన ప్రతిష్టకు పోయి విద్యార్థుల్ని, ఒక విద్యా సంవత్సరాన్నే అగమ్య గోచర స్థితిలోకి నెడుతున్నారు. ఇంకో వైపు విద్యా ప్రమాణాలు దిగజారి, డిగ్రీలు అసంబద్ధమై, చేతికొచ్చే పట్టాలు ఉపాధికి పనికిరానివై, పట్టాపొందిన విద్యార్థుల్లో ఉద్యోగార్హతల్లేక... ఉన్నత విద్యకే పెనుసవాలుగా నిలుస్తున్నా యి. ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి సంస్కరణ దిశలో తక్షణ చర్యలు చేపట్టకుంటే అది ఇప్పట్లో బాగుపడే లక్షణాలు ఏ మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల కార్పొరేట్ శక్తులు పెట్టుబడిదారులై, విద్య ఫక్తు వ్యాపారమై, ఉపాధ్యాయుల్ని ఉద్యోగులుగా, విద్యార్థుల్ని వినియోగదారులుగా పరిగణిస్తు న్నంత కాలం ఉన్నత విద్యకు మోక్షం లేదనే భావన బలపడుతోంది.
 
ఇంతకన్నా దయనీయం ఏముంటుంది?
తెలంగాణ రాష్ట్రంలో ఈసారి దాదాపు 80 ఇంజనీరింగ్ కళాశాలలు విధి లేని స్థితిలో, స్వచ్ఛందంగా మూసేసుకునే పరిస్థితి. 40 కళాశాలల్లో కనీసం ఒక విద్యార్థి కూడా చేరలేదు. సుమారు అంతే సంఖ్యలో కళాశాలలు, మేం పిల్లల్ని చేర్చుకోవడం లేదు, ఇక తనిఖీలకు మమ్మల్ని పరిగణనలోకి తీసుకోకండి అని స్వయంగా అధికారులకు తెలియజెప్పడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 700 కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలుండి, దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల్ని చేర్చుకొని, ఏటా ఒకటిన్నర లక్షల ఇంజనీర్లను పట్టాలిచ్చి బయటకు పంపినప్పుడు గొప్ప రాష్ట్రంగా మురిశాం. గ్లోబలీ కరణలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఐటీ రంగ అవకాశాలు, మార్కెట్ చోదక ఆర్థిక వ్యవస్థ, బయటి సేవల వినియోగం... వీటి పుణ్యమా అని మన కుర్ర ఇంజనీర్లందరికీ సువర్ణావకాశాలని సంబరపడ్డాం.

కానీ, అరకొర మౌలిక సదుపాయాలు, ఉండీలేని బోధనా సిబ్బంది, ఉన్న  టీచర్లకూ కనీస విద్యా ర్హతలు లేని దుస్థితిలో పిల్లలేం నేర్చారని గమనించలేకపోయాం. విద్యను వ్యాపారం చేసి, డబ్బు గడించడమే ధ్యేయమనుకున్న నిర్వాహకులు మొండి గోడల్ని కొంచెం అటుఇటుగా మార్చి కోళ్లఫారాలలో కూడా కాలేజీలు నడిపిన దౌర్భాగ్యం. ఇంజనీరింగ్ పిల్లలకు బోధించడానికి ఎమ్‌టెక్ తదితరపీజీ డిగ్రీ కనీసార్హత అయిన చోట, బీటెక్ కాదు కదా పాలిటెక్నిక్ చదివిన వారితోనూ పాఠాలు చెప్పించిన ఉదంతాలున్నాయి. ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో ఉద్యోగా ర్హత ఎంత అనే విషయమై, ప్రభుత్వం పనుపున ‘ఆస్పైరింగ్ మైండ్స్’అన్న ఏజెన్సీ జరిపిన అధ్యయనంలో వెలుగు చూసిన నిజాలు ఎవరికైనా ముచ్చె మటలు పుట్టిస్తాయి. ప్రతి వంద మంది ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో ఉద్యోగార్హత కలిగిన వారి సంఖ్య రాష్ట్రంలో 17 కంటే తక్కువ! ఇది బీహార్, జార్ఖండ్ (100 నుంచి 75 శాతాల మధ్య), మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ (75 -50 శాతాల మధ్య), ఒరిస్సా, రాజస్థాన్ (50-25 శాతాల మధ్య) రాష్ట్రాల కన్నా అధ్వాన్నమైన స్థితి.
 
 ఎందుకీ దుస్థితి దాపురించిందంటే, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇంజనీరింగ్ కాలేజీలు నడిపిన వారి అత్యాశ వల్ల. మెజారిటీ కాలేజీలు ఏ నిబందనలు అనుసరించకుండా, ఏ ప్రమాణాలూ పాటించకుండా నడిచినవే! ఇతర కాలేజీ సిబ్బందిని తమ సిబ్బందిగా చూప డం, లేని విద్యార్థుల్ని ఉన్నట్టుగా చూపి ఫీజు రీయింబర్స్‌మెంటు, ఉపకార వేతనాలు కొల్లగొట్టడం వంటి నేరాలూ-ఘోరాలూ జరిగాయి. అవన్నీ తనిఖీ చేసి, ప్రాథమికంగా నిర్ధారించుకొని, నిన్నటికి నిన్న 11 ఇంజనీరింగ్ కాలేజీలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వృత్తి కళాశాలల్లో ప్రమాణాలపై అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వ టాస్క్‌ఫోర్సు నివేదికలోనే నివ్వెరపరిచే నిజాలున్నాయి. 2012 ఆగస్టు 11న అప్పటి రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్సు (జివో ఎమ్మెస్ నం: 54) మొత్తం 654 కాలే జీల్లో పరిశీలన జరిపింది.
 
  అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం చూస్తే, 319 కాలేజీల్లో అవసరమైన భవన సదుపా యాలు లేవు. 394 కాలేజీల్లో కంప్యూటర్ టర్మినల్స్ ప్రమాణాల ప్రకారం లేవని, 449 కాలేజీల్లో ల్యాబరేటరీ సదుపాయాలు లేవని, 622 కాలేజీల్లో బోధనా సిబ్బంది ప్రమాణాలకనుగుణంగా లేరని తేల్చిచెప్పింది. టీచర్- విద్యార్థి నిష్పత్తి 1:15 ఉండాలన్నది ప్రామాణికమైతే, సదరు నిర్వహణ ఎక్కడా దరిదాపుల్లో కూడా లేదని తేటతెల్లమైంది. అందులోనూ, విద్యార్హతలతో నిమిత్తం లేకుండా చూసినా టీచర్-విద్యార్థి నిష్పత్తి సగటున 1:28 గా ఉండింది. 171 కాలేజీల్లో ఆ నిష్పత్తి 1:51 గా ఉందంటే దుస్థితిని తేలిగ్గానే అంచనా వేయొచ్చు! వేతన సంఘం సిఫారసుల ప్రకారం టీచర్లకు వేతనాలిచ్చారా? అనేది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేని సదుపాయాలు ఉన్నట్టు 58 కాలేజీలు సుప్రీంకోర్టుకు, 11 కాలేజీలు హైకోర్టుకు నిర్లజ్జగా తప్పుడు అఫిడవిట్లు ఇవ్వడం వారి విచ్చలవిడితనాన్ని స్పష్టం చేసింది. మధ్య, అల్పాదాయ బడుగు జీవుల పిల్లలకూ ఉన్నత విద్య లభించాలనే ఉదాత్త ఆశయంతో తలపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొల్లగొట్టడానికే పుబ్బలో పుట్టి మఖలో మూతపడ్డ కాలేజీలూ ఉన్నాయి.
 
 అఖిల భారత స్థితేమీ గొప్పగా లేదు!
 ప్రపంచం నాగరికత కోసం అలమటిస్తున్నపుడు, పదిహేను వందల సంవత్స రాల కిందటే నలంద, తక్షశిల, విక్రమశిల వంటి పేరెన్నిక గన్న విశ్వవిద్యాల యాలు నెలకొల్పి, విశ్వవిద్యకు బీజం వేసిన నేల ఇది. ఇటీవలి కాలం వరకూ భారతదేశానికి చెందిన ఐఐటి వంటి విద్యా సంస్థలు ప్రపంచంలోని పది మేటి విద్యాసంస్థల్లో ఉండేవి. కానీ, ఇటీవల వెలువరించిన ఓ తాజా అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచంలోని తొలి 200 విశ్వవిద్యాలయా ల్లోనూ భారత్‌కు చోటు దక్కలేదు. 2014-15కుగాను ప్రపంచ విశ్వవిద్యాల యాలు, తత్సమాన విద్యా సంస్థలకు ర్యాంకులిస్తూ ‘టైమ్స్’ ఉన్నత విద్య విభాగం ఈ నివేదికను వెల్లడించింది.

దేశానికి చెందిన 2 సంస్థలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు, చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలకు మాత్రం 276 నుంచి 300 స్థానాల్లో చోటు దక్కింది. ఐఐటీ-ముంబాయి, ఐఐటీ-రూర్కీలకు 351 నుంచి 400 ర్యాంకుల్లో స్థానం దక్కింది. మొదటి 10 స్థానాల్లో 7 (మొదటి 200లలో 74 స్థానాలు) దక్కించుకొని అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి పదిలో మిగతా 3 స్థానాలు బ్రిటన్ విశ్వవిద్యాలయాలకు దక్కాయి. ఇక ‘బ్రిక్స్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో 2014-15 కోసం విడిగా మరో అధ్యయనం జరిగింది. ఇందులో కూడా భారత్‌కు ఆశించదగ్గ ఫలితాలు కనిపించకపోవడం హెచ్చరిక లాంటిదే! తొలి రెండు స్థానాలు చైనా విశ్వవిద్యాలయాలకు, మూడో స్థానం టర్కీ విద్యాసంస్థకు దక్కింది. వంద ర్యాంకుల్లో 25వ స్థానం మాత్రం మన బెంగళూరు ఐఐటీకి దక్కింది. ఆ పైన మరో పది సంస్థలు, ప్రధానంగా ఐఐటీలూ ఈ వందలో చోటు దక్కించుకున్నాయి. కేవలం ఈ ర్యాంకింగులే అన్నింటికీ ప్రామాణికం కాకపోవచ్చు. కానీ, మన దేశంలో ఉన్నత విద్యా రంగంలో దిగజారుతున్న ప్రమాణాలకు ఖచ్చితంగా ఇది స్పష్టమైన సంకేతమే!

 ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి!
  ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్న దేశంగా పరిశీలించినపుడు, మన ఉన్నత విద్యారంగం ఆందోళన కలిగించేలా ఉందనడం అతిశయోక్తి ఏం కాదు. 24 సంవత్సరాల లోపు వయస్కుల జనాభా, 2011 నాటికే దేశంలో 50 శాతాన్ని మించింది. ఈ ఒరవడి ఇంకా ఉధృతితో కొనసాగుతోంది. 2020 నాటికి పనిచేసే వయస్కులు (15-64 ఏళ్లు), మొత్తం జనాభాలో మూడింట రెండొంతులుగా ఉంటారని అంచనా. మారుతున్న ప్రపంచ మార్కెట్ స్థితి, ఐ.టి అవకాశాలు, విజ్ఞాన ప్రపంచ ఆవిష్కరణల నేపథ్యంలో పరిస్థితుల్ని భారత్ తనకు అనుకూలంగా మలచుకోవడానికి ఉన్నత విద్యా ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఉన్నత విద్య స్థాయిలో, ముఖ్యంగా వృత్తి విద్య 70 శాతం వరకు ప్రయివేటు, కార్పొరేట్ శక్తుల  గుప్పిట్లోనే ఉంది.

లాభాపేక్షతో విద్యా సంస్థల్ని వ్యాపార దృక్పథంతో నడపడం వల్ల ప్రమాణాలుండటం లేదు. ఆర్థిక అసమానతల వల్ల అన్ని వర్గాల వారికి సమానావకాశాలుండటం లేదు. అర్హులైన బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్నత విద్యకు ప్రభుత్వం స్థూల వార్షికాదాయం (జీడీపీ)లో 0.37 శాతం నిధుల్ని మాత్రమే వెచ్చిస్తోంది. ఏ అభివృద్ధి చెందిన దేశంతో పోల్చి చూసినా ఇది చాలా నామమాత్రమే! ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అదే స్థాయిలో మూడో అతి పెద్ద ఉన్నత విద్యావ్యవస్థ కలిగిన దేశంగా గ్లోబలీకరణ సవాళ్లకు ఎదురొడ్డి, అవకాశాల్ని సానుకూలంగా మలచుకోవడానికి భారత్ సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా-
 1. అవకాశం-విస్తరణ.
 2. సమదృష్టి-కలుపుకొనిపోవడం.
 3. నాణ్యత-ప్రపంచ ప్రమాణాలు- అన్న మూడంశాలకు ప్రాధాన్యత ఇచ్చి సత్వర సంస్కరణలు చేపడితేనే ఈ దేశంలో ఉన్నత విద్య బాగుపడుతుంది.

ఆర్. దిలీప్ రెడ్డి  
ఎగ్జిక్యూటివ్ ఎడిటర్

 ఈమెయిల్: dileepreddy@sakshi.com                                       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement