విలీనమా! విమోచనమా?
నిజాం పాలనను శ్లాఘించడం పూర్తిగా అసంగతం కూడా. ఆ విధంగా ఆయన మీద స్వాతంత్య్ర పోరాటం చేసిన మహనీయులను ప్రతినాయకులుగా చిత్రించడం బాధాకరం. మైనారిటీలకు దగ్గర కావాలంటే అది హుందాగా జరగాలే తప్ప, వక్రీకరణలతో మాత్రం కాదు.
నాలుగేళ్ల క్రితం, అంటే 2010లోనే సెప్టెంబర్ 17 సందర్భం మీద వివాదం తలెత్తింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ విషయం మీద వివాదం రావడం అదే మొదటిసారి. 1948లో హైదరాబాద్ సంస్థానం మీద పోలీసు చర్య చేపట్టినపుడు చివరికి నిజాం లొంగిపోయిన రోజు అదే. క్లుప్తంగా జరిగిన ఒక కార్యక్రమంలో హైదరాబాద్ రాజ్య సైన్యాధ్యక్షుడు జనరల్ ఎల్ అడ్రూస్ భారత సైన్యానికి చెందిన జనరల్ జేఎన్ చౌదరి ఎదుట ఆయుధాలు అప్పగించాడు. ఇదంతా జరిగిన 62 సంవత్సరాల తరువాత ఈ చర్య విమోచనమా? దురాక్రమణా? లేదంటే విలీనమా? అన్న వివాదం తలెత్తింది.
సెప్టెంబర్ 17 ఘటన జరిగిన కొద్దికాలానికి ఆ సందర్భాన్ని విమోచన దినంగా జరుపుకున్న సంగతి పాతకాలం వారందరికీ గుర్తే. ఈ సందర్భంలోని వాస్తవం గురించిగానీ, మనోభావాల గురించిగానీ పెద్దగా తెలియదు కాబట్టి రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల వారికి ఈ ఘట్టం గురించి ఏమీ పట్టలేదు. నిజానికి తెలంగాణ ప్రాంతంలోని కొందరు కూడా అవగాహన లోపంతో ఆ సందర్భానికి ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆందుకే ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత ఈ సందర్భానికి ఉన్న ప్రాధాన్యం గురించి అంతా క్రమంగా మరచిపోయారు. తరాలు గడచిపోతున్న కొద్దీ, పోలీసు చర్యకు దారి తీసిన పరిస్థితుల గురించి తెలిసిన వారు కూడా తగ్గిపోతున్నారు. ఇప్పుడు పోలీసు చర్య ఉదంతం మీద కొన్ని పార్టీలకు, కొందరు వ్యక్తులకు అవగాహన లోపించడం దాని ఫలితమే. ఇలాంటి రాజకీయ పార్టీలు ఈ వివాదం గురించి లబ్ధి పొందకుండా జాగ్రత్త పడడానికి ఆ తరానికి చెందిన వ్యక్తిగా, ఆ పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా, 80 ఏళ్ల జీవితాను భవం కలిగిన వ్యక్తిగా కొన్నివిషయాలు గుర్తుచేయడం నా విధిగా భావిస్తున్నాను.
భారత ప్రభుత్వం చేపట్టిన పోలీసు చర్య మీద ఉన్న గందరగోళం నుంచి ఈ తరం వారిని విముక్తం చేయడానికి, ఆ చర్యకు ముందు జరిగిన కొన్ని వాస్తవిక ఘటనల గురించి వివరించాలి. ఈ అంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఒక స్వదేశీ సంస్థానం వ్యవహారాలలో భారత ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవలసి వచ్చింది? ఈ ఆక్రమణ దురాక్రమణ కింద పరిణమించిందా? విలీనమైతే వివాదమే ఉండదు. ఎందుకంటే, సంస్థానాధీశుడే రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసినట్టు పోలీసు చర్య దరిమిలా ఒప్పందం మీద సంతకం పెట్టేవాడు. కాబట్టి అప్పుడు జరిగినది విమోచనమా? లేకపోతే దురాక్రమణా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలంటే చరిత్ర పుటల దగ్గరకు వెళ్లాలి.
బ్రిటిష్ ఇండియాలో నిజాం సంస్థానం ప్రత్యేకమైనది. విస్తారమైనది. ఉప ఖండంలోనే పెద్ద సంస్థానం. సొంత కరెన్సీ, తపాలా శాఖ, రైల్వేలు, పోలీసు, న్యాయ వ్యవస్థలు సమకూర్చుకున్న సంస్థానం కూడా ఇదే. ఇందులో దాదాపు 85 శాతం హిందువులు. పాలకుడు మాత్రం మహమ్మదీయుడు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చేనాటికి సింహాసనం మీద ఉన్న నవాబు అసఫ్ జాహి వంశానికి చెందిన సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నిజానికి భారత స్వాతంత్య్ర పోరాటమే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడడానికి ప్రేరణ ఇచ్చింది. నిజానికి తన రాజ్యంలో ఉన్న మెజారిటీ ప్రజల మనోగతం తెలిసినప్పటికీ నిజాం నవాబు తన అధికారం వదులుకోవడానికి సిద్ధపడలేదు. భారత యూనియన్‌లో విలీనం కావాలన్నది హైదరాబాద్ సంస్థానంలో ఉన్న మెజారిటీ ప్రజలు, అంటే హిందువుల అభిప్రాయం.
వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్ సంస్థానంలో ఉన్న మెజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య సాంఘిక పరమైన, ఆర్థికపరమైన స్థాయిలో పెద్దగా భేదం లేదు. ప్రత్యేక హోదా ఉన్న వ్యక్తులు కొందరు మాత్రం ఈ రెండు వర్గాలలోను కూడా ఉండేవారు. కానీ పాలకుడు మహమ్మదీయుడు కావడంతో ఆ వర్గానికి చెందిన వారు అదొక సదుపాయంగా భావించుకునేవారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ముస్లింలు, తమ పౌరులు హిందువులతో సమంగానే వెనుకబడి ఉండేవారు. ముస్లింలలో చదువుకున్న వారికీ, వ్యాపారులకు ప్రత్యేక సౌకర్యాలు లభించేవి. హిందువులలోని కొందరు వ్యక్తులకు కూడా ఈ హక్కులను రాజ్యం కల్పించేది. భూస్వామ్య వర్గాలకు చెందిన వీరంతా నవాబుకు అండదండలను ఇచ్చేవారు.
నిజాం పాలన ఘనమైనదంటూ ఇటీవల కొందరు తరచు వ్యాఖ్యా నిస్తున్నారు. అసలు దక్కనీ చరిత్రలోనే నిజాం పాలన స్వర్ణయుగమని చెప్పడానికి కూడా వారు వెనుకాడడం లేదు. హైదరాబాద్ తదితర ప్రాతాలలో నవాబు కట్టించిన భారీ భవంతులు, నిజాం సాగర్ వంటి నీటి పథకాల నిర్మాణాలను బట్టి, విద్యారంగానికి చేసిన సేవను చూసి; ఆరోగ్యం, కమ్యూనికేషన్ల వ్యవస్థ, సంక్షేమం వంటి అంశాలను చూసి వారు ఆ వాదనను ప్రజల ముందుకు తీసుకువస్తున్నట్టు చెబుతున్నారు. కానీ ఇవి ప్రజల అవసరాలను నిజంగా తీర్చాయా? నిజాం సంస్థానంలో మొత్తం 16 జిల్లాలు ఉండేవి. ఇందులో ఎనిమిది తెలుగు ప్రాంతంలోనివి. 5 మరాఠ్వాడాలోను, మూడు కర్ణాటక ప్రాంతంలోను ఉండేవి. ఇందులో ప్రతి జిల్లాకు ఒక ఉన్నత పాఠశాల ఉండేదని చెప్పడానికి అవకాశం లేని పరిస్థితి. హైదరాబాద్ తరువాత మిగిలిన ప్రాంతానికి ఒకే ఒక్క కళాశాల వరంగల్‌లో ఉండేది. అక్కడైనా ఇంటర్మీడియెట్ వరకే విద్య లభించేది. ఇంటర్ తరువాత కూడా విద్యను కొనసాగించదలచిన వారంతా హైదరాబాద్ నగరానికి వెళ్లక తప్పేది కాదు. దీనితో చాలామందికి అవకాశం ఉండేది కాదు. అంతేకాదు, దీని వల్ల బాగా ధనవంతులు, ఉన్నత వర్గీయులకే చదువుకునే అవకాశం కలిగేది.
ప్రాథమిక విద్య కూడా తాలూకా కేంద్రాలలోనే లభించేది. దీనితో లోతట్టు గ్రామీణ ప్రాంతాల పిల్లలకు చదువు గగనకుసుమంలా మారిపోయింది. హైదరాబాద్‌లో అయినా రెండు మాత్రమే ఇంటర్ కళాశాలలు ఉండేవి. అవే- సిటీ కాలేజ్ ఫర్ సైన్స్, చాదర్‌ఘాట్ ఆర్ట్స్ కాలేజీ. ఈ రెండు కళాశాలల్లోను ఉర్దూ మీడియం ఉండేది. అండర్ గ్రాడ్యుయేట్ చదువు కోసం రెండు సంస్థలను ఎవరైనా ఆశ్రయించవలసివచ్చేది. ఒకటి ఉస్మానియా విశ్వవిద్యాలయం, రెండు నిజాం కాలేజీ. ఉస్మానియాలో ఉర్దూ మీడియం కాగా, నిజాం కాలేజీలో ఇంగ్లిష్ మీడియం ఉండేది. నిజాం కాలేజీ మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. హైదరాబాద్ నగరంలో ఇంగ్లిష్ మీడియం ఉన్న రెండు మూడు విద్యా సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థులకు తప్ప, మొత్తం ఉర్దూ మీడియం అభ్యర్థులకు నిజాం కాలేజీలో చేరే అవకాశం ఉండేది కాదు. వెరసి ఒక విషయం అర్థమవుతుంది. 85 శాతంతో మెజారిటీగా ఉన్న తెలుగు వారు, అనివార్యంగా ఉర్దూ మీడియంలో చదువుకోక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. తెలుగు భాష పాఠ్య ప్రణాళికలో లేదని కాదు. కానీ ఏడో తరగతి వరకే చెప్పేవారు. అది కూడా థర్డ్ లాంగ్వేజ్ హోదా మాత్రమే ఉండేది. విజ్ఞాన శాస్త్రం చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునే తెలుగు వారంతా అలా ఎనిమిదో తరగతి నుంచి మాతృభాషకు దూరమయ్యేవారు. ఇంగ్లిష్ మినహా మిగిలిన పాఠ్యాంశాలన్నీ ఉర్దూలోనే బోధించేవారు. శనివారం మొదలై, గురువారంతో వారం ముగిసేది. శుక్రవారం వారాంతపు సెలవుగా అమలు చేసేవారు. ఇది ము స్లింల మత అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమలుచేసిన నిర్ణయం మాత్రమే.
విధుల విషయంలో కూడా నవాబు ఆలోచన తక్కువ సిబ్బందితో సాధ్యమైనంత పని చేయించడం అనే రీతిలోనే ఉండేది. నవాబు తన వర్గానికి చెందిన వారి పైనే ఎక్కువగా ఆధారపడి పాలన సాగించేవాడు. ప్రభుత్వ కార్యాలయాలలోని ముఖ్యమైన పదవులన్నీ వారితోనే నింపాడు. కిషన్ ప్రసాద్, నారాయణరావు గంగాఖేద్కర్ వంటి అరుదైన ఉదాహరణలు తప్పితే, ఉన్నత పదవులన్నీ సర్వసాధారణంగా నవాబు తన వర్గీయులకే కట్టబెట్టేవాడు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, అటవీ శాఖ ఉద్యోగాలలో 90 శాతం ఒక వర్గానికే దక్కేవి. ఉన్నతోద్యోగాలకు ఆ స్థాయి అర్హతలు ఉన్న వ్యక్తి, తన వర్గంలో లభించకుంటే, తన వర్గానికే చెందిన వారిని ఉత్తర భారతదేశం నుంచి రప్పించి, ఉద్యోగాలు కట్టబెట్టేవారు. మధ్య ప్రాచ్యం నుంచి వచ్చినవారికీ, అరబ్బులకు కూడా ఉద్యోగాలు దక్కుతూ ఉండేవి. మతాంతీకరణలు తక్కువే అయినా, మెజారిటీ ప్రజలు అవమానాలను ఎదుర్కొనవలసిన స్థితిలో ఉండేవారు. తాము ద్వితీయ శ్రేణి పౌరులం కాబోలునని వీరు తరచు ప్రశ్నించుకోవలసిన వాతావరణమే ఉండేది. చట్టబద్ధమైన హక్కులు కూడా వీరికి దక్కేవి కాదు.
ఆరోగ్య సేవలలో కూడా నవాబు తీసుకున్న చర్యలు సమున్నతంగా కనిపించవు. తాలూకా కేంద్రంలో ఒక డిస్పెన్సరీ ఉండేది. ఉన్నత స్థాయి వైద్య సదుపాయం కావాలంటే ఉస్మానియా ఆస్పత్రికి హైదరాబాద్ రావలసిందే. నిజం చెప్పాలంటే 90 శాతం సాధారణ ప్రజానీకం సరైన వైద్య వసతికి నోచుకోలేదు. ఇక్కడే నాటి మేధావి, యునెటైడ్ ప్రావిన్స్‌తో పాటు, దేశం మొత్తం మీద గొప్ప వకీలుగా పేరున్న తేజ్‌బహదూర్ సప్రూ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యను ఉదహరించాలి. నిజాం పాలనలోనే సప్రూ ఉస్మానియా విశ్వవిద్యాల యంలో జరిగిన స్నాతకోత్సవానికి హాజరయ్యారు. మిగిలిన సంస్థానం దారిద్య్రంతో అలమటిస్తుండగా హైదరాబాద్ నగరంలో కనిపించే హైకోర్టు భవంతి, ఉస్మానియా ఆస్పత్రి, ఆర్ట్స్ కాలేజీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం భవనాలను చూసి మురిసిపోవడంలో అర్థం లేదని ఆయన తన ఉపన్యాసంలోనే పేర్కొన్నాడు.
రాజకీయ కార్యకలాపాలేవీ నిజాంకు రుచించేవి కావు. ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ కావచ్చు, ఎవరు గళమెత్తినా ఆయనకు నచ్చేది కాదు. అయితే ఏదో ఒకరోజున మెజారిటీ తిరగబడుతుందని చెప్పే హెచ్చరికలు గోడల మీద దర్శనం ఇస్తూ ఉండేవి. మగ్దూం మొహియుద్దీన్, షోయిబుల్లా ఖాన్ వంటివారు ఈ ప్రమాదం గురించి హెచ్చరించినవారే. ఈ దశలో మజ్లిస్ ఇతేహాదుల్ ముస్లిమీన్ హైదరాబాద్ సంస్థానంలో ముస్లింలను రక్షించే సంస్థగా కనపడింది. దీని నాయకుడే ఖాశిం రజ్వీ. ముస్లింలు ఈ దేశాన్ని పాలించడానికే ఉన్నారన్న నమ్మకాన్ని ఆ వర్గంలో పెంచి పోషించిన ఘనత ఈ సంస్థదే. మిగిలిన బ్రిటిష్ ఇండియాలో స్వాతంత్య్ర కాంక్ష పెరుగుతున్న కొద్దీ, నిజాం సంస్థానంలో కూడా అందుకు సంబంధించిన సంకేతాలు కనిపించాయి.
నిజాం మీద పోరాటం ఉధృతమౌతున్నకొద్దీ రజాకార్లు కూడా విజృం భించారు. నిజాం రాజ్యం స్వర్గం కాదు. సెక్యులర్ రాజ్యం అంత కంటె కాదు. నిజాం ప్రజాభిమానం ఉన్న నియంత కూడా కాదు. ఇదే నిజమైతే, ఆ పోరాటంలో అంతమంది చేసిన ప్రాణ త్యాగాలకు అర్థం ఉండదు. నిజాం పాలనను శ్లాఘించడం పూర్తిగా అసంగతం కూడా. ఆ విధంగా ఆయన మీద స్వాతంత్య్ర పోరాటం చేసిన మహనీయులను ప్రతినాయకులుగా చిత్రించడం బాధాకరం. మైనారిటీలకు దగ్గర కావాలంటే అది హుందాగా జరగాలే తప్ప, వక్రీకరణలతో మాత్రం కాదు.
(వ్యాసకర్త తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు) -ఎల్. లోహిత్ రెడ్డి